దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చుతుంది. అందులో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతుంది. మొన్న సినిమా సెలబ్స్ కు కరోనా వస్తే.. తాజాగా పొలిటిషిన్స్.. అందులోనూ మంత్రులకు కరోనా పాజిటివ్ గా తేలింది.
మహారాష్ట్రని అతలాకుతలం చేస్తున్న కరోనా.. ఇప్పుడు ఉద్ధవ్ కేబినెట్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఆ రాష్ట్ర మంత్రి జితేంద్ర అహ్వాద్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల ఈ ఎన్సీపీ నేత … ముందస్తు చెకప్ కోసం థానేలోని ఒక ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. తన సెక్యూరిటీలో స్టాఫ్‌కు కరోనా సోకడంతో ఆయన కొన్నాళ్ల పాటు స్వచ్ఛందంగా హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఏప్రిల్ 13కు ముందు టెస్టులు చేయించుకున్న జితేంద్రకు… నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే.. తాజా టెస్టులో ఆయనకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
కాగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6వేలు దాటింది. వాటిలో కేవలం ముంబైలోనే 4వేల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 778 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,427కు చేరింది. ముంబైలో నిన్న ఒక్కరోజే కొత్తగా 478 పాజిటివ్ కేసులు నమోదు కాగా అక్కడ అంటే ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 4,232కి చేరింది. తాజాగా 8 మంది మరణించడంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 168కి చేరిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.