పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలను అవమానించారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బీజేపీకి తెలంగాణపై మొదట్నుంచి ప్రేమ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం గ్రామంలో దళిత బంధు పథకం లబ్దిదారులకు అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై హరీష్ విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో ఇంతమంది బలిదానాలకు కాంగ్రెస్, బీజేపీ కారణం కాదా? అని ప్రశ్నించారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే అంత మంది చనిపోయేవారా అని నిలదీశారు. ఏడేళ్లయినా విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు అని మండిపడ్డారు. ఉత్తర భారతానికి ఒకనీతి, దక్షిణ భారతానికి ఒక నీతా? అని బీజేపీపై నిప్పులు చెరిగారు.
కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ విమర్శించారు. తెలంగాణకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని.. కానీ కాంగ్రెస్ అధికార గర్వం వల్ల ఏపీ-తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సామరస్య పద్దతిలో జరగాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. విభజన చేసిన రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిందని, తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ను ఉభయ రాష్ట్రాల ప్రజలు నమ్మలేదని అన్నారు.