మంత్రి శ్రీవాణికి కులం చిక్కులు..

minister pushpa sreevani has caste issuesమంత్రి శ్రీవాణికి కులం చిక్కులు..

ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదనే కుల వివాదం ఇప్పుడు ఏపీలో ఆసక్తికరమైన చర్చకు కారణమైంది. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన పుష్ప శ్రీ వాణి జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకుని గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో పుష్ప శ్రీ వాణి ఎస్టీ కాదని ఆమెకు గిరిజన సంక్షేమ శాఖ ఏ విధంగా కేటాయిస్తారని ఆరోపణలు మొదలయ్యాయి.  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి వివాహం తర్వాత విజయనగరం జిల్లా జియమ్మవలస మండలంలోని చినమేరంగి కోటలో స్థిరపడ్డారు.  ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఆమె భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి ఎస్టీ కోటాలో పోటీ చేసిన ఆమె రెండో సారి విజయం సాధించి మంత్రయ్యారు. శ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు.  అయితే ఆమె ఎస్టీ కాదంటూ ఏపీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి అప్పలనర్స సంచలన ఆరోపణలు చేశారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి కులానికి సంబంధించి వివాదం కోర్టు విచారణలో ఉందని, అలాంటప్పుడు ఆమెను ఎస్టీ కోటా పేరుతో మంత్రివర్గంలోకి ఎలా తీసుకుంటారని వ్యాఖ్యానించారు. అంతేకాదు గిరిజన సంక్షేమ శాఖను కూడా ఎలా కేటాయిస్తారని అప్పలనర్స ప్రశ్నిస్తున్నారు. పుష్పశ్రీవాణి సోదరి రామతులసి ఎస్టీ కాదని ధ్రువీకరిస్తూ ఆమెను ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి అధికారులు తొలగించారని రామతులసి ఎస్టీ కానప్పుడు ఆమె సోదరి పుష్పశ్రీవాణి గిరిజనురాలు ఎలా అవుతారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.