జెడ్పీ చైర్మన్లకి మినిస్టర్ హోదా…కేసీఆర్ దిశానిర్దేశం

minister status for zp chairmen

హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఏకపక్షంగా విజయం సాధించిన వారిని అభినందించారు. ఐదేళ్లు పని చేసి బాగా పేరు తెచ్చుకోవాలని వారికి కేసీఆర్ సూచించారు. పదవి వచ్చిన తర్వాత సహజత్వాన్ని కోల్పోవద్దని, గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతిధులు ప్రగతి సాధనలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యానికి పూర్వ వైభవం తీసుకరావాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగ్రామిగా నిలిచే జిల్లా పరిషత్‌లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ. 10 కోట్ల మంజురు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నిధిని 32 జిల్లాలు పొందుతాయన్న ఆకాంక్షను సీఎం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్‌లో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కొత్త పంచాయతీరాజ్ చట్టం, గ్రామలలో పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్నట్టు సీఎం చెప్పారు. గతంలో జడ్‌పీ చైర్మన్లకు పెద్దగా పని ఉండేది కాదనీ, కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకవచ్చి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాత్రను క్రియాశీలకంగా మార్చామని అన్నారు. జెడ్పీ చైర్మన్లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోదా కల్పించడంతో పాటు, వారందరికి కొత్త కార్లు ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. పదవీ గర్వం, అధికార దర్పం ఏ కోశానా రానీయకుండా ఎప్పటి మాదిరిగానే సహజత్వాన్ని కోల్పోకూడదని హితవు పలికారు. దర్పంతో గౌరవం పెరగదని, ప్రవర్తన వల్ల పెరుగుతుందని అన్నారు. పెట్టుడు గుణం కంటే పుట్టుడు గుణం మంచిదన్న పెద్దల మాట మరచిపోవద్దని సీఎం గుర్తు చేశారు. వివిధ సమస్యలతో వచ్చే ప్రజలను గౌరవించి వారి సమస్యలను పరిష్కరించడం నాయకునికి ఉండాల్సిన మంచి లక్షణమని అన్నారు.