నేటి నుండే ఏపీ అసెంబ్లీ….అన్నీ ముహూర్తం ప్రకారమే ?

ap assembly meeting started

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా ఘనవిజయం సాధించిన అనంతరం ఈరోజు నుండి అసెంబ్లీ సమావేశాలు వెలగపూడి అసెంబ్లీలో ప్రారంభం కానున్నాయి. ఎన్ని కల అనంతరం తొలిసారి జరగనున్న శాసనసభ సమావేశానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానున్నది. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 15, 16 తేదీల్లో సభకు విరామం కాగా, 17,18 తేదీల్లో తిరిగి సమావేశాలు కొనసాగనున్నాయి. ఆ రెండు రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి జూలైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.
ముహూర్తం :
ముఖ్యమంత్రి జగన్‌ ఉదయం 10:30 గంటలకు శాసనసభలోని తన చాంబర్‌లో అడుగుపెడతారు. వేదపండితుల పూజా కార్యక్రమాల అనంతరం తన సీట్లో కూర్చుంటారు. 11:05 గంటలకు శాసనసభలో అడుగుపెడతారు. ప్రస్తుత అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 151 కాగా, తెలుగుదేశం పార్టీకి 23 మంది, జనసేనకు ఒక ఎమ్మెల్యే బలం ఉంది. వీరందరూ ఈరోజే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.