Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కరణం మల్లీశ్వరి ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించి రెండు దశాబ్దాలు దాటింది. ఎంతో మంది క్రీడాకారిణిలు ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్నప్పటికీ… త్రివర్ణ పతాకం మాత్రం రెపరెపలాడలేదు. 1994లో మొదటి సారి, 1995లో రెండో సారి కరణం మల్లీశ్వరి స్వర్ణ పతకం గెలిచిన తర్వాత నుంచి అభిమానులు మరో స్వర్ణం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడింది.
మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ జెండా సగర్వంగా ఎగిరింది. భారత్ కు చెందిన మీరాబాయ్ చాను ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణపతకం కైవసం చేసుకుంది. కృష్ణుడి కోసం నిరీక్షించే భక్తురాలు మీరాభాయ్ పేరు పెట్టుకున్న చాను వెయిట్ లిఫ్టింగ్ అభిమానుల ఎదురుచూపులకు స్వర్ణ పతకం రూపంలో ముగింపు పలికింది. 48 కేజీల విభాగంలో పాల్గొన్న 23 ఏళ్ల మీరాబాయ్ 85 కేజీల స్నాచ్, 109 కేజీల క్లీన్ అండ్ జెర్క్ తో కలిపి మొత్తం 194 కేజీలు ఎత్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. కాలిఫోర్నియాలోని అనాహిమ్ టౌన్ లో ఈ చాంపియన్ షిప్ జరుగుతోంది.
మీరాబాయ్ గత ఏడాది రియో ఒలంపిక్స్ కు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. అయితే తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైన ఆమె…వరల్డ్ చాంపియన్ షిప్ లో మాత్రం కల నెరవేర్చకుంది. స్వర్ణాన్ని అందుకునేందుకు పోడియం వద్దకు వెళ్లే సమయంలో మీరాబాయ్ ఉద్వేగానికి లోనయింది. అంతర్జాతీయ బాక్సర్ మేరీకోమ్ లానే మీరాబాయ్ కూడా మణిపూర్ మణిపూస. అటు మీరాబాయ్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మీరాబాయ్ చానూను చూసి దేశం గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. రెండు దశాబ్దాల తర్వాత దేశానికి పసిడి అందించిన ఆమె క్రీడాస్ఫూర్తిని కొనియాడారు. అద్భుతమైన మహిళా క్రీడాకారిణిని ఈ దేశానికి అందించిన మణిపూర్ రాష్ట్రాన్ని అభినందించారు.