మిస్టర్‌ కె.కె. రివ్యూ

mister kk movie review

ప్రయోగాలు వైవిధ్యమైన కథాంశాలకు ప్రాముఖ్యతనిస్తూ సినిమాలు చేస్తుంటారు విక్రమ్‌. తమిళంలో ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో అనువాదమై పెద్ద విజయాల్ని సాధించాయి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే తప్పకుండా కొత్తదనం ఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అపరిచితుడు తర్వాత విక్రమ్‌ నటించిన సినిమాలేవీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. విజయం కోసం ‘మిస్టర్‌ కె.కె’ సినిమాతో యాక్షన్‌ బాట పట్టారు విక్రమ్‌. విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేష్‌ సెల్వ దర్శకత్వం వహించారు. పారిజాత క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేసింది. ప్రచార చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కె.కె(విక్రమ్‌) ఓ క్రిమినల్‌. డబ్బు కోసం నేరాలకు పాల్పడుతుంటాడు. అండర్‌కవర్‌ ఏజెంట్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో సాక్ష్యాలు లేకుండా తెలివితేటలతో బయటపడుతుంటాడు. మలేషియాలో ఓ రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడతాడు. తొలుత కె.కెను గుర్తుతెలియని వ్యక్తిగా భావించిన పోలీసులు అతడి పూర్వపరాల్ని తెలుసుకోవడం ప్రారంభిస్తారు. వాసు(అభిహాసన్‌), అధిర(అక్షరహాసన్‌) భార్యభర్తలు. గర్భవతి అయిన అధిరను కొందరు కిడ్నాప్‌ చేసి పోలీసుల భద్రత మధ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కె.కె ను అక్కడి నుంచి తప్పించాల్సిందిగా వాసును బెదిరిస్తారు. హాస్పిటల్‌ నుంచి బయటకు వచ్చిన వారిని విన్సెంట్‌ అనే పోలీస్‌ అధికారి చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. అందుకు కారణం ఏమిటి?విన్సెంట్‌తో కె.కె.కు ఉన్న శతృత్వమేమిటి? కె.కె. సహాయంతో ప్రాణంగా ప్రేమించిన భార్యను వాసు ఎలా కాపాడుకున్నాడు? అన్నదే మిగతా కథ.
రొమాంచితంగా సాగే పోరాటఘట్టాలు, ఆశ్చర్యానికి గురిచేసే ఛేజింగ్‌లతో హాలీవుడ్‌ శైలి సినిమా చేయాలనే ఆలోచన మంచిదే. కానీ వాటితోనే ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు థియేటర్లలో కూర్చోబెట్టాలని ఆలోచిస్తే అత్యాశే అవుతుంది. మిస్టర్‌ కె.కెతో దర్శకుడు రాజేష్‌ సెల్వ అలాంటి ప్రయత్నమే చేశారు. కథ కంటే యాక్షన్‌ అంశాలకే ప్రాముఖ్యతనిస్తూ ైస్టెలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందించి విజయాన్ని అందుకోవాలని అనుకున్నారు. ప్లాన్‌ చేసి నేరస్తుడిగా తనపై ముద్రవేసి చంపాలని ప్రయత్నించిన ఓ పోలీస్‌ అధికారిపై తన తెలివితేటలతో ఓ క్రిమినల్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే చిన్న పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు. రొటీన్‌ కథే అయినా తన కథనంతోనైనా ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశాడా అంటే అదీ లేదు. ఓ చిన్న మలుపుపై ఆధారపడి సాగతీస్తూ వెళ్లిపోయారు. ద్వితీయార్థంలోనే అదేమిటో తెలిసిపోవడంతో సినిమా పట్ల ఉన్న ఆసక్తి పూర్తిగా సన్నగిల్లుతుంది.
ఓ వైపు పద్మవ్యూహం నుంచి తప్పించుకోవడానికి విక్రమ్‌ చేసే ప్రయత్నాలు చూపిస్తూనే మరోవైపు తన భార్యను రక్షించుకోవడం అమాయకుడైన భర్త పడే సంఘర్షణను సమాంతరంగా ఆవిష్కరిస్తూ కథనం సాగుతుంది. ఆ ఎమోషన్‌ అంతగా కనెక్ట్‌ అవ్వదు. బలవంతుడైన పోలీస్‌ అధికారిని ఎదిరించడం కోసం విక్రమ్‌ వేసే ప్లాన్‌లలో ఉత్కంఠ లోపించింది. ైక్లెమాక్స్‌ చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
నెగెటివ్‌ షేడ్స్‌తో కూడిన క్రిమినల్‌గా తన అభినయంతో విక్రమ్‌ ఈ సినిమాను శాయశక్తులా నిలబెట్టే ప్రయత్నం చేశారు. సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌, ఒంటినిండా టాటూలతో ఆద్యంతం ఆయన పాత్ర వినూత్నంగా సాగుతుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో హుషారుగా కనిపించారు. నాజర్‌ తనయుడు అభిహాసన్‌కు ఇదే తొలి సినిమా అయినా భావోద్వేగ సన్నివేశాల్లో ప్రతిభను చాటారు. అక్షర హాసన్‌ పాత్ర నిడివి తక్కువే అయినా మెప్పించింది.
సాంకేతికంగా జిబ్రాన్‌ నేపథ్య సంగీతం, శ్రీనివాస్‌ ఛాయాగ్రహణం ఈసినిమాకు వెన్నుముకగా నిలిచాయి. పసలేని సన్నివేశాలకు తన నేపథ్య సంగీతంతో ప్రాణంపోశారు జిబ్రాన్‌. మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించడం సినిమాకు కొత్త శోభను తీసుకొచ్చింది.
విక్రమ్‌ నటించిన మరో రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. పేరులో ఉన్న కొత్తదనం కథ, కథనాల్లో కనిపించదు. యాక్షన్‌ సన్నివేశాలు మినహా సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు,