తన వంతు సాయం చేసిన మిథాలీ రాజ్

తన వంతు సాయం చేసిన మిథాలీ రాజ్

మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పోరు కోసం తెలుగమ్మాయి, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చేతులు కలిపింది. మొత్తం రూ.10 లక్షలు విరాళం ప్రకటించింది. అందులో ప్రధాన మంత్రి నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ట్విటర్‌లో పేర్కొంది.

భారత జట్టు సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ రూ.2 లక్షలు, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రూ.1.5 లక్షల విరాళం ప్రకటించారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌ తన నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి విరాళంగా అందజేసింది. రాజ్యసభ ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్న మేరీ.. నెల జీతం లక్ష రూపాయలను సహాయ నిధికి బదిలీ చేయాల్సిందిగా బ్యాంక్‌ అధికారులను కోరింది. కేంద్ర క్రీడా ప్రాధికార సంఘం (సాయ్‌) ఉద్యోగులు మూడు రోజుల జీతాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మొత్తం రూ.76 లక్షలు.

టీనేజ్‌ షూటర్‌ మను భాకర్‌ హర్యానా ప్రభాత్వానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది. టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఆటగాడు జి.సాతియాన్‌ రూ. 1.25 లక్షలను విరాళంగా ప్రకటించాడు. అందులో లక్ష రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి, మిగిలిన రూ. 25 వేలను ప్రధాని సహాయ నిధికి బదిలీ చేస్తున్నట్లు తెలిపాడు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ రూ. 11 లక్షల విరాళం ప్రకటించాడు.