కూలి డబ్బులు అడిగినందుకు దాడి చేసిన యజమాని

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం మన దేశంలోనూ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు తమ కూలి డబ్బులు అడిగినందుకు గాను యజమాని ఆ కార్మికుడు ఫై దాడి చేయించిన సంఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.

ఖిలా వ‌రంగల్ మండ‌లం న‌క్క‌ల‌పెల్లి గ్రామంలో ఒడిశాకు చెందిన కొంత‌మంది కూలీలు ఇటుక బ‌ట్టిలో కార్మికులు గా ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం తమకు రావలిసిన కూలీ డ‌బ్బులు చెల్లించాల‌ని యాజ‌మాని శ్రీనివాస్‌ను కోరగా కోపోద్రుక్తుడైన యజమాని, త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కార్మికుల‌పై దాడికి చేసాడు.

ఈ ఘటన జరిగిన వెంట‌నే కార్మికులంద‌రు మామూనూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని య‌జమాని శ్రీనివాస్ నాయుడు పై ఫిర్యాదు చేశారు. ఈమేరకు సీఐ సార్ల రాజు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన కార్మికుల వివరాలను సేకరించారు, అనంత‌రం యజమానిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.