రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ విషాదంలో మునిగింది. పార్టీకి చెందిన వల్లభ్‌నగర్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ శక్తవట్ (48) బుధవారం ఉదయం కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన మృతిచెందారు. ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ నియోజకవర్గం నుంచి గజేంద్రసింగ్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. అతడి మృతికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, పార్టీ సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్, కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
పచ్చకామెర్లతో బాధపడుతున్న గజేంద్రసింగ్ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ సమయంలో అతడికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ తేలింది. దీంతో నెల నుంచి చికిత్స పొందుతున్నాడు. అనారోగ్యంతో గజేంద్రసింగ్ మృతిచెందాడు. గజేంద్రసింగ్ వల్లభ్‌నగర్ నుంచి 2008, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు గులాబ్ సింగ్ కుమారుడే గజేంద్రసింగ్. ఈయన మేవార్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. గతేడాది కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు అప్పటి ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ వెంట ఉన్నారు. అతడి మృతికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సంతాపం వ్యక్తం చేశారు. అతడి మరణం దిగ్ర్భాంతికి గురి చేసిందని చెప్పారు. సచిన్ పైలెట్ కూడా గజేంద్రసింగ్ మృతికి సంతాపం తెలిపారు.