కెమెరామెన్ మీద జలీల్ ఖాన్ దాడి !

Jaleel Khan Allegedly Manhandles Video Journalist

ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తనపై దాడి చేశారంటూ ఓ టీవీ ఛానల్‌ కు చెందిన కెమెరామెన్ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేయాలని, వారి నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం జలీల్‌ఖాన్‌ సోదరుడి కోడలు ఇటీవల పోలీసులను కలసి ఎమ్మెల్యేపై, ఆయన కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు. తన భర్త ఇటీవల చనిపోయాడని, తన పాపను ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ అనుచరులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిడ్డను తనకు ఇప్పించాలంటూ పోలీసు కమిషనర్‌ను కోరారు.

ఈ క్రమంలో విచారణ కోసం పోలీసు అధికారులు జలీల్‌ఖాన్‌ను గురువారం కమిషనరేట్‌కు పిలిపించారు. వారిని కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్న జలీల్‌ ఖాన్‌ను ఓ ఛానల్‌ కెమెరామెన్‌ నాని వీడియో షూట్ చేశారు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు అతడిని అడ్డుకున్నారు. జలీల్‌ఖాన్ అతడి చేతిని మెలితిప్పి వీడియో ఎందుకు తీశావంటూ అడుగుతుండగా గర ఏడీసీపీ నవాబ్‌ జాన్‌ అటుగా వెళ్తూ ఇది వ్యక్తిగత వ్యవహారమైనందున ఎందుకు వీడియో తీస్తున్నావని ప్రశ్నిస్తూ కెమెరామెన్‌తో వీడియోను తొలగింపజేశారు. అయితే ఇలా చేయి మేలితిప్పిన సంగతి తెలియగానే నగరంలోని పలువురు జర్నలిస్టులు పోలీసు కమిషనర్‌ ఆఫీసుకు వచ్చిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వెంటనే బాధితుడికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులతో పాటు ఏడీసీపీ నవాబ్‌ జాన్‌ మీద కూడా సీపీకి ఫిర్యాదు చేశారు. తనను ఏడీసీపీ బెదిరించి బలవంతంగా వీడియోను తొలగించారని ఫిర్యాదులో కెమెరామెన్‌ పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం జలీల్ ఖాన్ కోడలు పోలీసులను ఆశ్రయించారు. సీపీ ఆదేశాల మేరకు డీసీపీ ఇరువర్గాలను విచారించిన సమయంలో పాపను తనకిస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదని తెలిపారు. దీంతో పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు గురువారం రాత్రి ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. పాపను తల్లికి అప్పగించేందుకు అంగీకారం కుదరడంతో సమస్య తీరిపోయిందని పోలీసులు తెలిపారు.