తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చూసేందుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. కేసీఆర్ కాళేశ్వర జలసంపద సందర్శనయాత్ర పేరుతో ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి.. నియోజవర్గం నుంచి 40 బస్సులు, ఇతర వాహనాల్లో వేలమందిని తీసుకువెళ్లారు. కాళేశ్వరం వెళ్లే వాహనాలను జనగామలోఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. మేడిగడ్డ వద్దకు చేరుకొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని సీసీ కెమెరాలో గమనించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెంటనే ఆయనకు ఫోన్‌చేశారు.
ప్రాజెక్టు నిర్మాణం, నీటి లభ్యత, ప్రస్తుత నీటిమట్టం తదితర విషయాలను మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను రైతులు, పార్టీ నాయకులకు నేరుగా తెలియజేసేందుకు ప్రాజెక్టు సందర్శనకు వచ్చినట్టు సీఎం కేసీఆర్‌కు ముత్తిరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల్లో మనోధైర్యం పెరిగిందని.. గోదావరి నీటిని ఎదురు ప్రవహింపజేసిన ఘనత చరిత్రలో మీకే దక్కుతుందని, సదా తెలంగాణ ప్రజలు మీకు రుణపడి ఉంటారని ముఖ్యమంత్రితో పేర్కొన్నారు. ఎమ్మెల్యే బృందం మేడిగడ్డ ప్రాజెక్టు, కన్నెపల్లి పంపుహౌస్, అన్నారం బరాజ్‌ను సందర్శించింది.