కరోనా భయంతో మానవత్వాన్ని మరచిన స్థానికులు

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తుంది. దీంతో ఎక్కడివారు అక్కడే ఉంటూ ఇళ్లకే పరిమితమౌతున్నారు. దేశంలో ముఖ్యంగా లాక్ డౌన్ నడుస్తోంది. అయితే లాక్ డౌన్ నడుస్తోన్న ఈ సమయంలో కరోనా విస్తరించకుండా ఉండటం, తోటి వారికి అండగా నిలవడం మానవాళి ముందున్న ఆప్షన్స్. కానీ జనాలు కొందరు వికృత చేష్టలకు దిగుతున్నారు.

ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కరోనా అనుమానితులుగా భావిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి బిహార్‌ చేరుకున్న ఓ కార్మికుడిని స్థానికులు దారుణంగా కొట్టి చంపడం కలకలం రేపుతోంది. ఈ ఘటన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో తాజాగా చోటుచేసుకుంది. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన ఓ కార్మికుడు ఉపాధి కోసం మహారాష్ట్ర వలస వెళ్లాడు. కరోనా వైరస్‌ అంతటా విస్తరిస్తుండటంతో మొత్తం దేశమంతా లాక్‌డౌన్‌ లో ఉంది. అలాగే.. మహారాష్ట్రలో కరోనా కేసులు చాలా విపరీతంగా నమోదౌతున్నాయి. దీంతో అతను కుటుంబంతో సహా.. స్వస్థలం బిహార్‌కు చేరుకున్నాడు.

ఇలాంటి సమయంలో ఇద్దరు స్థానికులు ఆ కార్మికుడిని స్వగ్రామంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా అతడిపై దాడి చేసి చంపేశారు. అది తెలుసుకున్న పోలీసులు అందులో పాలుపంచుకున్న  ఏడుగురిని అరెస్ట్‌ చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు హెచ్చరించారు.