త్వరలో మన దేశంలో మొబైల్ నంబర్ 11 అంకెలకు చేరనున్నాయని తెలుస్తోంది. ఒకప్పుడు 9 సిరీస్ లో ఉండే మొబైల్ నంబర్లు టాటా డోకొమో రాకతో 8 సిరీస్ కు చేరుకుంటేనే అబ్బో అనుకున్నాం. కానీ అవి మెల్లగా 7 సిరీస్ కు, జియో రాకతో 6 సిరీస్ కు కూడా చేరుకున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకునే నంబర్లకు కొరత ఏర్పడుతుండటంతో 11 అంకెల మొబైల్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
మొబైల్ నంబరింగ్ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేసే అవకాశాలను కూడా ట్రాయి పరిశీలిస్తోంది. 9, 8, 7 సిరీస్ ల ద్వారా 210 కోట్ల మొబైల్ నంబర్లు సృష్టించే అవకాశం ఉంది. అయితే 2050 నాటికి దేశంలో దాదాపు మరో 2.6 బిలియన్ మొబైల్ నంబర్లు అవసరం అవుతాయని కొన్ని నివేదికల్లో తేలింది. పెరుగుతున్న జనాభా, వివిధ అవసరాలకు వివిధ మొబైల్ నంబర్లు ఉపయోగించే విధానం పెరగడం, ఒక్కొక్కరే రెండేసి, మూడేసి ఫోన్లు ఉపయోగిస్తూ ఉండటం దీనికి కారణం కావచ్చు.
గతంలో 1993, 2003 సంవత్సరాల్లో భారతదేశంలో ఫోన్ నంబర్ల ప్రణాళికలను సమీక్షించారు. 2003 నంబరింగ్ ప్రణాళిక ప్రకారం.. 75 కోట్లు కొత్త ఫోన్ కనెక్షన్లకు నంబర్లు అందించే అవకాశం కలిగింది. ఇందులో 45 కోట్లు మొబైల్ నంబర్లు కాగా, 30 కోట్లు ల్యాండ్ లైన్ నంబర్లుగా ఉన్నాయి. కనెక్షన్ల సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరుగుతూ ఉండటంతో ప్రస్తుతం నంబర్లకు అవసరమైన వనరులు అందుబాటులో ఉండవేమో అని ట్రాయ్ అభిప్రాయపడుతోంది. ట్రాయ్ 11 అంకెల మొబైల్ నంబర్ ను ప్రవేశపెట్టే ఆలోచన చేయడానికి ఇది కూడా ఒక కారణమే.
అయితే ఈ షాక్ మొబైల్స్ కే కాదు.. ల్యాండ్ లైన్లకు కూడా తగలనుంది. త్వరలో ల్యాండ్ లైన్ల నంబర్లు కూడా 10 అంకెలకు చేరే అవకాశం ఉంది. కేవలం డేటా ఉపయోగించే డాంగిల్ కనెక్షన్ల నంబర్లను 10 నుంచి 13 అంకెలకు పెంచడం ద్వారా 3, 5, 6 సిరీస్ నంబర్లలో కొన్ని నంబర్లను ఖాళీ చేయాలని ట్రాయ్ యోచిస్తోంది.