Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పర్యటన సందర్భంగా మోడీ వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఏ దేశాధినేత ఇండియా వచ్చినా… ఆయనకు స్వయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదల ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించే ప్రధాని ఇంతవరకూ ట్రూడోను కలవకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రూడో కుటుంబ సమేతంగా ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్నప్పటికీ… మోడీ ఆయన వెంట రాలేదు. ఆ తర్వాత కూడా ట్రూడోతో మర్యాదపూర్వకంగా అయినా భేటీ కాలేదు. మోడీ వైఖరిని కెనడా మీడియాతో పాటు భారత మీడియా కూడా తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో ట్రూడో పరోక్షంగా దీనిపై స్పందించారు.
తాను రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజలను కలిసి వారితో నేరుగా మాట్లాడేందుకు వచ్చానే తప్ప షేక్ హాండ్లు, ఫొటోల కోసం కాదని ట్రూడో వ్యాఖ్యానించారు. వ్యాపారం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భారత ప్రజలకు కెనడా ఎంతో దగ్గరయిందని, ప్రతి సంవత్సరమూ 1.25 లక్షల మంది విద్యార్థులు తమ దేశానికి విద్యాభ్యాసం నిమిత్తం వస్తుంటారని చెప్పారు. మున్ముందు కెనడాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ముంబై పర్యటనలో ట్రూడో షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను, ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ ను కలిశారు.