సరిహద్దు నుంచి యుద్ధ సందేశాన్ని ఇచ్చిన మోదీ

సరిహద్దు నుంచి యుద్ధ సందేశాన్ని ఇచ్చిన మోదీ

పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్‌ 370 తొలగింపు (కశ్మీర్‌), లాక్‌డౌన్‌ విధింపు వంటి అనుహ్య నిర్ణయాలతో దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అదే పంథాను ఎంచుకున్నారు. భారత్‌-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మూడోకంటికి కూడా తెలియకుండా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పర్యటించి శుక్రవారం ఉదయం ఊహించని వార్తను దేశ ప్రజలకు వినిపించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జరనల్‌ ఎంఎమ్‌ నరవణేతో కలిసి మోదీ లేహ్‌ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జూన్‌ 15న చోటుచేసుకున్న గల్వాన్‌ లోయ హింసాత్మక ఘటనలో గాయపడిన సైనిక జవాన్లను 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న భారత సైనిక స్థావరం నిములో ప్రధాని పరామర్శించారు. అలాగే సరిహద్దు ప్రతిష్టంభనపై చైనా-భారత్‌ కమాండర్‌ స్థాయి సమావేశాల్లో పాల్గొన్న సైనిక అధికారులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

గల్వాన్‌ హింసాత్మక ఘటనపై స్థానిక జవాన్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలోని తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భగా సరిహద్దులోని పరిస్థితిని సైనికాధికారులు మోదీకి వివరించారు. ఈ పరిణామం చైనాతో పాటు పాకిస్తాన్‌, నేపాల్‌ దేశాలు కొంత కంటగింపు లాంటిదేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. సరిహద్దు నుంచి మోదీ యుద్ధ సందేశాన్ని ఇచ్చారని చెబుతున్నారు. మొదట గల్వాన్‌ లోయలో యుద్ధ వాతావరణం తలపించడం, ఆ తరువాత ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు జరపడం భారత్‌ శాంతి మంత్రాన్ని ప్రతిపాధించడం అయినప్పటికీ చైనా పద్దతి మార్చుకోకపోవడం వంటి కీలక పరిణామల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిహద్దుల్లో భారతపై దురాక్రమణకు కాలుదువ్వుతున్న డ్రాగన్‌కు మూకుతాడు వేసేందుకు మోదీ ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా వారం కిందటే చైనాకు చెందిన 59 యాప్స్‌ను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఎల్‌ఏసీ వెంట నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సైనిక సన్నద్ధతను సమీక్షించడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ శుక్రవారం లద్దాఖ్‌ పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఆయన స్థానంలో హుటాహుటిన మోదీ లద్దాఖ్‌కు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా చైనా సరిహద్దుల్లో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో పర్యటించారు. సియాచిన్‌కు వెళ్లిన తొలి ప్రధానిగా రికార్డు సైతం నెలకొల్పారు.

మరోవైపు ఇరు దేశాల మధ్య ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మోదీ లద్దాఖ్‌కు వెళ్లడం అతిపెద్ద పరిణామామని పలువురు మాజీ సైనికాధికారులు బెబుతున్నారు. చైనాకు బుద్దిచెప్పేందుకు సైనికంగా పూర్తి స్థాయి సన్నద్ధతో ఉన్నమాని పొరుగు దేశాలకు చాటిచెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు. మోదీ పర్యటన సరిహద్దు వెంట విధులు నిర్వహిస్తున్న సైనికులు మానసిక బలం, కదనోత్సహం కలుగుతుందని చెబుతున్నారు. ఇక మోదీ పర్యటన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.