రౌడీమూక ఎన్ కౌంటర్… 8 మంది పోలీసులు మృతి

ENCOUNTER

ఉత్తర ప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ రౌడీమూక రెచ్చిపోయి ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపడంతో 8మంది పోలీసులు మృత్యువాత పడ్డారు.  కాన్పూర్‌లో రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే మృతి చెందిన వారిలో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటే… కరడుకట్టిన నేరస్థుడు వికాస్ దూబే గ్యాంగ్ ను పట్టుకొనేందుకు గత రాత్రి 16 మంది పోలీసు బృందం వెళ్లింది. అయితే ఈ విషయం ముందే తెలుసుకుని తమ భవనం పైన తుపాకులతో రెడీగా ఉన్న వికాస్ దూబే ముఠా సభ్యులు పోలీసులు వచ్చిన వెంటనే కాల్పులకు తెగబడ్డారు.

అలాగే… పోలీసులు తామున్న భవనం వద్దకు రాకుండా జేసీబీని అడ్డుపెట్టి రోడ్డును మూసివేశారు. ముఠా సభ్యులు జరిపిన కాల్పుల్లో ఒక డీఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్ స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మరణించారు. కాగా ముఠాసభ్యుల కాల్పుల్లో గాయపడిన మరో నలుగురు పోలీసులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీరియస్‌ అయిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌…రౌడీమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.