గాల్వన్ వ్యాలీ మీద సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర

గాల్వన్ వ్యాలీ మీద సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర

గత నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఎంతగానో చర్చనీయాంశమైన పదం గాల్వాన్ వ్యాలీ.. . ఇండియా, చైనా సరిహద్దుల్లోని భారత భూభాగంలో ఉన్న ఈ లోయపై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నించడం.. వారిని సైన్యాన్ని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టడం.. ఈ క్రమంలో చైనీయులు చేసిన దాడిలో మన సైనికులు కూడా 20 మంది ప్రాణాలు వదలడం.. చైనా అంతకు రెట్టింపు స్థాయిలో నష్టపోవడం తెలిసిన సంగతే.

ఓవైపు దేశమంతా కరోనాపై పోరాడుతుండగా.. సరిహద్దుల్లో ఇలాంటి ఘర్షణ చోటు చేసుకోవడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా గాల్వాన్ లోయ విశేషాలు.. అక్కడ సైన్యం మోహరించిన తీరు.. చుట్టుపక్కల పరిస్థితుల గురించి అనేక వార్తలొచ్చాయి. ఇండియా, చైనా మధ్య సాగిన చిన్నపాటి యుద్ధం గురించి కూడా ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి.

అవి చదువుతుంటే సినిమాలకు ఏమాత్రం తీసిపోని ఉత్కంఠ కనిపించింది. ఈ ఉత్కంఠను సినిమా రూపంలోకి తేవడానికి సన్నాహాలు మొదలైపోయాయి. ఐతే మామూలుగా ఇలా పెద్ద ఉదంతాలు జరిగినపుడు బాలీవుడ్ ఫిలిం మేకర్లు వెంటనే సినిమాలకు రంగం సిద్ధం చేస్తారు. ఐతే ఈసారి ఈ ప్రయత్నం మల్లూవుడ్‌లో జరుగుతోంది. ఒకప్పుడు ఆర్మీలో పని చేసి.. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి నటుడిగా, దర్శకుడిగా పేరు సంపాదించిన మేజర్ రవి.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో హీరోగా నటించనున్నాడు. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి ‘1971’ పేరుతో ఓ సినిమా చేశారు. అందులో మన అల్లు శిరీష్ కూడా ఓ కీలక పాత్ర చేశాడు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది కానీ.. మేజర్ రవికి సైన్యం సంబంధిత అంశాలపై ఉన్న పట్టు ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఆయన గాల్వన్ వ్యాలీ మీద మోహన్ లాల్ ప్రధాన పాత్రలో సినిమా తీయబోతున్నారనగానే ప్రత్యేక ఆసక్తి నెలకొంది.