డీప్​ఫేక్​పై మోదీ ఆందోళన.. అవగాహన కల్పించాలని మీడియాకు విజ్ఞప్తి

ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డీప్ ఫేక్ ఫొటోలు వీడియోల గురించే చర్చ జరుగుతోంది. ఇది చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్నా, ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న వీడియో బాగా వైరల్ కావడం, దానిపై కేంద్ర ఐటీ శాఖతో సహా సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించడంతో ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​తో ఎన్ని లాభాలున్నా, దీనివల్ల భవిష్యత్​లో కలిగే ముప్పు గురించి అందరూ భయపడుతూనే ఉన్నారు. తాజాగా ఈ డీప్ ఫేక్ వ్యవహారంతో ఇప్పుడు ఆ భయం ఇంకాస్త ఎక్కువైంది. ఈ వ్యవహారంపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు.

డీప్ ఫేక్​, ఏఐలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని దుర్వినియోగం చేసి డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించడం సమస్యాత్మకం అని ఇది చాలా ఆందోళనకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఏఐ, డీప్ ఫేక్​లపై మాట్లాడారు. డీప్ ఫేక్ ఫొటోలు వీడియోలు మన వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. డీప్‌ఫేక్‌ వీడియోలపై జర్నలిస్టులు, మీడియా.. ప్రజలకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని కోరారు. టెక్నాలజీ వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, వాటి నుంచి ఎలా అప్రమత్తమవ్వాలో ప్రజలకు వివరించాలని సూచించారు.