Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై గృహహింస, లైంగికదాడి, అత్యాచార యత్నం వంటి ఎన్నోరకాల ఆరోపణలు చేసిన
అతని భార్య హసీన్ జహాన్… ఈ దశలో భర్తతో రాజీ సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తన భర్తతో సర్దుకుపోవడానికి ఎంతో ప్రయత్నించానని, అతని తీరుతో విసిగి వేసారిపోయాకే బయటకు వచ్చి మాట్లాడాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తంచేసింది. షమి మొబైల్ తనకు దొరికి అతడి చీకటి వ్యవహారాలకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించడం వల్లే తానిలా మాట్లాడగలుగుతున్నానని, లేదంటే తన పరిస్థితి దయనీయమైఉండేదని వ్యాఖ్యానించింది. షమిలో పశ్చాత్తాప భావమే లేదని, వివిధ దేశాల్లోని అనేకమంది మహిళలతో సంబంధాలు కొనసాగించాడని మరో మారు ఆరోపించింది. షమి మొబైల్ తన చేతికి చిక్కకపోయిఉంటే అతను ఉత్తర్ ప్రదేశ్ కు పారిపోయేవాడని, తన నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసేవాడని తెలిపింది. షమీతో రాజీచేసుకునే దశ దాటిపోయిందని, పోలీసులు విచారణ జరుపుతున్నారని, ఈ దశలో రాజీ కష్టమని, ఏదైనా తన లాయర్ సలహా మేరకే నడుచుకుంటానని ఆమె చెప్పింది.
జహాన్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు షమీ కుటుంబీకులు నలుగురు కోల్ కతా రాగా, వారిని కలిసేందుకు ఆమె నిరాకరించినట్టు సమాచారం. తన కుమార్తె ఒక పేరుమోసిన క్రికెటర్ తో న్యాయపోరాటం చేస్తున్నందున ఆమెకు పోలీస్ రక్షణ పెంచాలని హసీన్ తండ్రి కోరారు. షమీ మాత్రం చర్చల ద్వారా భార్యతో సమస్య పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. ఇలాంటి వ్యవహారంలో మాట్లడుకుని పరిష్కరించుకోవడం కంటే మంచి మార్గం మరొకటి ఉండదని, అది తమకు, తమ అమ్మాయికి మంచిదని, పరిష్కారం కోసం తాను కోల్ కతా వెళ్లడానికి కూడా సిద్ధమని షమీ చెప్పాడు. అటు షమీ కేసులో సమాచారం కోసం పోలీసులు బీసీసీఐని సంప్రదించారు. జహాన్ తన ఫిర్యాదులో దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత షమీ దుబాయ్ వెళ్లి పాకిస్థానీ యువతిని కలిసాడని ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షమీ దక్షిణాఫ్రికా టూర్ కు సంబంధించిన మార్గంపై సమాచారం ఇవ్వాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాశారు.