Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా… వస్తా అంటూ కలెక్షన్ కింగ్, మాజీ ఎంపీ మోహన్ బాబు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఈ డైలాగ్స్ దగ్గరే సీన్ ఆగిపోతోంది. ఆయన ఏ పార్టీలో చేరతారు, ఎవరితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తారు అనే విషయం ఇప్పటికీ ముడిచిన గుప్పిట్లో విషయమే. అయితే తాజాగా విడుదల అయిన గాయత్రి సినిమా డైలాగ్స్ చూస్తే ఆ గుట్టు రట్టు అయినట్టే వుంది. గాయత్రి సినిమాలో హీరో మోహన్ బాబు పాత్ర కధకు పెద్ద సంబంధం లేని పొలిటికల్ డైలాగ్స్ ఒకటి రెండు చెప్పారు. భూసేకరణ అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే అన్న కోణంలో ఒక డైలాగ్, చంద్రబాబు ఒకప్పుడు నేను వేసిన రోడ్ల మీద తిరిగేవాళ్లు నాకు ఓట్లు వేయరా అని చేసిన కామెంట్ మీద ఇంకో డైలాగ్ వున్నాయి. ఆ రెండు డైలాగ్స్ కూడా చంద్రబాబు సర్కార్ కి వ్యతిరేకంగా వున్నాయి. ఇక పోతే రాష్ట్రాన్ని ఇప్పుడు అతలాకుతలం చేస్తున్న ప్రత్యేక హోదా మీద కూడా గాయత్రి లో ఓ డైలాగ్ వుంది. అయితే సెన్సార్ లో దాన్ని కట్ చేసిన విషయం సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా తేలిగ్గా అర్ధం అవుతుంది.
గాయత్రి సినిమా చూసిన వాళ్లకి రాజకీయంగా మోహన్ బాబు ప్రయాణం ఎటు సాగుతుందో అర్ధం అవుతూనే వుంది… మోహన్ బాబు పెద్ద కోడలు వై.ఎస్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అయితే ఆ పెళ్లి తర్వాత మోహన్ బాబు వైసీపీ లో చేరడం లాంఛనం అని చాలా మంది అనుకున్నారు. అయితే మోహన్ బాబు ఆచితూచి వ్యవహరించడం చూసి మనసు మారిందేమో అనుకున్నారు. కానీ ఆపరేషన్ ఆకర్ష్ సమయంలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల మీద ఆయన డైలాగ్స్ చూస్తే మళ్లీ వైసీపీ వైపే మనసు లాగింది అనుకున్నారు. ఈ ఊహాగానాల మధ్యే నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇక ఏడాదిలో ఎన్నికలు అనగా గాయత్రి సినిమా వచ్చి మోహన్ బాబు మనసులో మాట లీక్ చేసింది. మోహన్ బాబు ఒక్కడే గాకుండా ఆయన కుమార్తె లక్ష్మి , చిన్న కుమారుడు మనోజ్ సైతం రాజకీయాల మీద ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒకరు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా, ఇంకొకరు సీమలోని ఏదో ఒక చోటు నుంచి ఎంపీ గా పోటీ చేసే చాన్సు ఉన్నట్టు తెలుస్తోంది .