ప్రముఖ నటుడు ఈమధ్యలోనే వైసీపీలో చేరిన మోహన్ బాబు చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేశారు. కర్ణాటకలోని మండ్యలో సుమలతకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబును నమ్మొద్దంటూ కన్నడిగులకు మోహన్‌బాబు సూచించారు. సుమలతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నేడు కర్ణాటకలో రెండో దశ లోక్‌సభ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 14 స్థానాలకు ఈసీ పోలింగ్‌ను నిర్వహిస్తోంది. వీటిలో మండ్య లోక్‌సభ నియోజకర్గం కూడా ఉంది. రెబల్ స్టార్ అంబరీష్ మరణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన సుమలత మండ్య నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఇదే నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, నటుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా సుమలతకే తమ మద్దతు ప్రకటించింది. సుమలత కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్-జేడీఎస్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో సుమలతను ఓడించడానికి కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అన్ని అవకాశాలను వాడుకుంది. అందుకే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తీసుకెళ్లి తెలుగింటి ఆడపడుచు అయిన సుమలతకు వ్యతిరేకంగా ప్రచారం చేయించింది. అయితే, నేడు పోలింగ్ సందర్భంగా మండ్య ప్రజలు సుమలతకే ఓటు వేయాలని కోరుతూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు నా ద్వారా అంబరీష్‌ను తన కార్యక్రమాలకు ఆహ్వానించారు. అంబరీష్ పాల్గొన్నారు. కానీ ఇప్పుడు, చంద్రబాబుకు కృతజ్ఞత లేదు. అంబరీష్ భార్యను ఎలా అయినా ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. సుమలతకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి చంద్రబాబు వెళ్లడం చూసి చాలా విడ్డూరంగా, ఆశ్చర్యకరంగా అనిపించింది. మీరంతా కుల, డబ్బు రాజకీయాలను పక్కనపెట్టి మన సుమలతకు మద్దతుగా నిలిచి దీవిస్తారని ఆశిస్తున్నాను’ అని మోహన్‌బాబు తన మెసేజ్‌లో పేర్కొన్నారు.