డబ్బుకోసం తోటి తాగుబోతుని హత్య చేసేశాడు..

Lover Dead In Thadikal Village

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగి సత్యనారాయణ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. మద్యం అలవాటే ఆయన దారుణ హత్యకు కారణమైనట్లు పోలీసులు తెలిపారు. హెచ్‌సీయూలో పనిచేస్తున్న సత్యనారాయణ వారం రోజుల క్రితం నార్సింగిలోని హైదర్ షా కోట నుంచి మాయమయ్యాడు. మరుసటి రోజు హిమాయత్ సాగర్ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది.

అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సత్యనారాయణ కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు టీంలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సత్యనారాయణది సహజ మరణం కాదని.. ఎవరో హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు జరిపారు. కాగా మృతదేహం లభ్యమైన హిమాయత్ సాగర్ ప్రాంతానికి అన్ని రహదారులలో సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిన్న క్లూ దొరికింది. దీంతో  సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్య జరిగిన రోజు సత్యనారాయణ మరో వ్యక్తితో కలసి వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం తాగే అలవాటున్న సత్యనారాయణ తరచూ సమీపంలోని కల్లు కాంపౌండ్‌కి వెళ్లేవాడు. ఆ సమయంలో కల్లు తాగేందుకు వచ్చే అజీమ్ అనే వ్యక్తితో పరిచయమైంది.

కాగా లాక్‌డౌన్‌తో పనిలేక ఇబ్బందులు పడుతున్న అజీమ్ కన్ను సత్యనారాయణపై పడింది. అతని వద్దనున్న బంగారం, డబ్బు కాజేయాలని ప్లాన్ చేశాడు. కల్లు కాంపౌండ్‌ సమయం దాటిపోయిందని యజమాని చెప్పడంతో బయటికి వెళ్లి తాగుదామని అజీమ్ నమ్మించాడు. హోండా యాక్టివాపై ఎక్కించుకుని హిమాయత్‌సాగర్ వైపు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సత్యనారాయణపై ఒక్కసారిగా దాడి చేసి అంతం చేశాడు. సత్యనారాయణ ఒంటిపై ఉన్న బంగారం, నగదు, బైక్ అపహరించి అక్కడి నుంచి పారిపోయాడు. మొత్తానికి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపగా.. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి విచారించడంతో అసలు విషయం తెలిసిందే.