హరిత ఇంధనాల వెల్లువలో భాగంగా అనుకోని పర్యవసానంగా సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ స్థాయి విపరీతంగా పెరుగుతోంది.సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ రంగు, వాసన లేని సింథటిక్ గ్యాస్. దీనికి మండే స్వభావం కూడా ఉండదు. మధ్యశ్రేణి, అధిక వోల్డేజీ విద్యుత్ పరికరాలు, వ్యవస్థలలో దీన్ని విద్యుత్ నిరోధంగా వాడతారు.సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ను విద్యుత్ రంగంలో విరివిగా వాడతారు. షార్ట్ సర్క్యూట్‌లు, విద్యుత్ ప్రమాదాల నివారణకుగాను విద్యుత్ నిరోధంగా దీన్ని ఉపయోగిస్తుంటారు.
గత కొంతకాలంగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఈ వాయు ఉద్గారాలు ఎంతగా పెరిగాయంటే.. కొత్తగా 13 లక్షల కార్లు రోడ్డుపైకి వస్తే ఎంత కాలుష్యం వెలువడుతుందో అంత స్థాయిలో పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి.భారీ విద్యుత్ కేంద్రాలు, టర్బైన్‌లు.. గ్రామాలు, పట్టణాల్లో ఉండే సబ్‌స్టేషన్ల వరకు అన్నిచోట్లా దీన్ని వినియోగిస్తారు. విద్యుత్ కారణంగా సంభవించే ప్రమాదావకాశాలను ఇది తగ్గిస్తుంది.
విద్యుత్ ప్రమాదాలను నిరోధించడానికి పనికొచ్చే ఈ వాయువు అన్నిటికంటే ఎక్కువగా భూతాపం కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కార్బన్ డై ఆక్సైడ్ కలిగించే భూతాపం కంటే ఇది 23,500 రెట్లు ఎక్కువ భూతాపం కలిగించగలదు.అంతేకాదు.. ఇది వాతావరణంలో సుదీర్ఘకాలం ఉండిపోతుంది. వెయ్యేళ్ల పాటు భూతాపానికి ఇది కారణమవుతుంది.