ఉగ్రవాదులకు సహకరించడంలో దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన పాకిస్తాన్… ముష్కర మూకలకు ఆశ్రయం కల్పించడంపై ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ విరుచుకుపడింది. 26/11 ముంబైపై ఉగ్రదాడులకు పాల్పడినవారికి పాకిస్తాన్ రాజభోగాలు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాసలో ఇస్లామాబాద్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన తర్వాత భారతదేశం పాకిస్తాన్‌ను గట్టిగా తిప్పికొట్టింది.
ప్రపంచంలోని చాలా ఉగ్రవాద దాడులకు మూలం, లేదా ఏదో ఒక రూపంలో ఆ దేశానికి సంబంధం ఉంటుందని ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి ఆర్.మధుసూదన్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ‘సాయుధ ఘర్షణల నుంచి పౌరులను రక్షించాలి’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అంతకుముందు ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ, దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదం యొక్క శాపాన్ని చవిచూసిన భారతదేశం, ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని తెలిపారు.
సెక్రటరీ జనరల్ నివేదిక ప్రకారం, పట్టణ ప్రాంతాలలో 50 మిలియన్లకు పైగా ప్రజలు సంఘర్షణతో ప్రభావితమయ్యారని, అఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, యెమెన్‌లోని ప్రజలు అంతర్గత సంఘర్షణల వల్ల కలిగే వినాశనాన్ని చూశారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద పోరు మళ్లీ పెరిగింది, ఇది కోవిడ్ మహమ్మారి కొనసాగుతుండటం వల్ల మరిం త క్లిష్టంగా మారిందని తిరుమూర్తి అన్నారు. సంఘర్షణానంతరం ఆయా ప్రాంతాల్లో సామాజికఆర్థిక పునరుద్ధరణ, శాంతిని పెంపొందించడం, పౌరులకు మౌలిక సదుపాయాల కల్పన, పునరావాసం కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.