మండల పరిధిలోని స్టువర్టుపురం గ్రామం ఘొల్లుమంది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో తల్లీ కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కొత్త సంవత్సరం వేడుకల జరుపుకునే తరుణంలో ఈ దుర్ఘటన జరగడంతో మృతుల కుటుంబాన్ని కలచివేసింది. వెదుళ్ళపల్లి ఎస్ఐ జనార్ధన్ కథనం ప్రకారం.. స్టూవర్టుపురం గ్రామానికి చెందిన పోలా కమలమ్మ , పోలా తేజ గ్రామంలోని చర్చికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు.
అప్పటికే తల్లీ కుమారుడు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తేజ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన స్టూవర్టుపురం గ్రామానికి వచ్చారు. తేజ భార్య అంజలి పిడుగురాళ్లలోని గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. కన్నతల్లిని చూసేందుకు స్వగ్రామానికి వచ్చిన భర్త తేజ, అత్త కమలమ్మ ఇరువురు మృతి చెందడంతో మృతుడి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. మృతుడి కుటుంబాన్ని ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.