Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆయా దేశాల జీవన ప్రమాణాల ఆధారంగానే… ఓ దేశం అభివృద్ది చెందిన దేశమా… లేక పేద దేశమా అన్నది నిర్ణయిస్తారు. సగటు మనిషి కనీస ఆదాయం పొందుతూ మెరుగైన జీవితం గడిపితే.. ఆ దేశం అభివృద్ది చెందినట్టే లెక్క. అమెరికా వంటి అగ్రరాజ్యం ఏనాడో ఆ జాబితాలో ఉంది. మనదేశం మాత్రం స్వాతంత్య్రం వచ్చిన 7ం ఏళ్ల తర్వాత కూడా అధికారికంగా ఇంకా ఆ హోదా సంపాదించలేకపోయింది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో పాటు మరికొందరు ప్రపంచనేతలు… మనదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో లేదని, ఎప్పుడో అభివృద్ధి సాధించేసిందని ప్రకటించారు కానీ..నిజానికి భారత్ లో పరిస్థితి అలా లేదు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారుతున్న పరిస్థితి మనదేశంలో నెలకొంది. అలాంటి మనం అమెరికాతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నట్టే లెక్క.
రహదారులు, ఆకాశ హర్మ్యాలే అభివృద్ధికి కొలమానం అనుకుంటే..మన దేశం అమెరికా దరిదాపుల్లో కూడా లేదు. ఈ విషయం ప్రభుత్వాలకూ, ప్రజలకు అందరికీ తెలుసు. మరి ఇలాంటి నేపథ్యంలో అమెరికా రహదారుల కన్నా..మన రోడ్లు బాగుంటాయి అనే సాహసం ఎవరైనా చేస్తారా… చేస్తే ఆ వ్యాఖ్య ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అనాలోచితంగా కూడా ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు కదా… కానీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం ఎంతో ఆలోచించే ఇలాంటి వ్యాఖ్య ఒకటి చేసి సోషల్ మీడియాలో అభాసు పాలయ్యారు. మధ్యప్రదేశ్ లో టూరిజం ప్రమోట్ చేసే ఉద్దేశంతో చౌహాన్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఉండగానే ఆయన మధ్యప్రదేశ్ రోడ్లను అమెరికా రోడ్లతో పోలుస్తూ ట్విట్టర్ లో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. తాను వాషింగ్టన్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే… అక్కడి రోడ్లను పరిశీలించానని, అయితే ఆ రోడ్ల కన్నా మధ్యప్రదేశ్ రోడ్లే మేలని తనకు అనిపించిందని ట్వీట్ చేశారు.
ఇదేదో ఊరికే చెప్పాలని అనడం లేదని, మధ్యప్రదేశ్ లో 1.75లక్షల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ మెరుగైన రోడ్లు వేయించామని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలపై విపక్షాల నుంచే కాక నెటిజన్ల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. 65.8లక్షల కిలోమీటర్ల మేర రోడ్ నెట్ వర్క్ తో ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్లు కలిగిఉన్న దేశంగా రికార్డు ఉన్న అమెరికాతో మధ్యప్రదేశ్ ను పోల్చడమేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అడుగడుగునా గుంతలు ఉండే మధ్యప్రదేశ్ రోడ్లకు…అమెరికాలోని విశాలమైన రహదారులకు పోలిక ఏమైనా ఉందా అనిమండిపడుతున్నాయి. నెటిజన్లు సైతం శివరాజ్ సింగ్ వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. వాషింగ్టన్ రోడ్లను, మధ్యప్రదేశ్ రోడ్ల ఫొటోలను పక్కపక్కనే ఉంచి పోస్ట్ చేస్తున్నారు. వర్షపు నీళ్లన్నీ రోడ్లపైకి వచ్చేస్తే..ఆయనను పోలీసులు ఎత్తుకుని తీసుకెళ్లున్న ఫొటోలను పోస్ట్ చేసి నెటిజన్లు ఎద్దేవాచేస్తున్నారు.