అధికారులకి చుక్కలు చూపిస్తున్న ఎమ్మార్వో లావణ్య

mro lavanya in acb custody

అవినీతి కేసులో అరెస్టయిన రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య ఏసీబీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ చిక్కిన కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఇచ్చిన సమాచారంతో గతవారం ఏసీబీ అధికారులు హయత్‌నగర్‌లోని లావణ్య ఇంట్లో సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఇంట్లో రూ.93లక్షల నగదు, 40తులాల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. అయితే కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు. కొందుర్గు వీఆర్వో అనంతయ్య తమ అక్రమాల చిట్టా విప్పుతుండగా లావణ్య మాత్రం నోరు విప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్ని కోణాల్లో గుచ్చిగుచ్చి అడిగినా మౌనమే సమాధానంగా వస్తోందంటున్నారు. లావణ్య పేరుతో ఉన్న రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించి పాస్‌బుక్‌లను ఏసీబీ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ ఖాతాల్లో ఎంత సొమ్ము ఉందో తెలుసుకునేందుకు బ్యాంకులకు లేఖలు రాయాలని నిర్ణయించారు. ఇటీవలే లావణ్య బంధువుల బ్యాంక్ ఖాతాల్లో ఏసీబీ అధికారులు రూ.38లక్షలు ఉన్నట్లు గుర్తించారు. లావణ్య అరెస్ట్ తర్వాత ఆమెకు చేసిన మరిన్ని నిర్వాకాలు వెలుగులోకి వచ్చాయి. కేశంపేట తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించాక ఆఫీసులో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించారని, లంచం ఇవ్వకపోతే అక్కడ ఏ పనికూడా జరగదని స్థానికులు చెబుతున్నారు. దీంతో లావణ్యకు సంబంధించి అనేక వివరాలు తెలుసుకునేందుకు ఏసీబీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించినా ఫలితం కనిపించడం లేదు. లావణ్య అరెస్ట్ అయిన తర్వాత జీహెచ్ఎంసీ‌లో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసే ఆమె భర్త అజ్ఞాతంలోకి వెళ్ళాడని అంటున్నారు. ఆయన దొరికితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది.