Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఏకైక కుమార్తె, ప్రముఖ వ్యాపారవేత్త నస్లీ వాడియా తల్లి దినా వాడియా కన్నుమూశారు. 98 ఏళ్ల దినా వాడియా న్యూయార్క్ లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా దినా వాడియా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా న్యూయార్క్ లోనే నివాసముంటున్న దినా వాడియాకు ఘనమైన గతం, అంతే ఘనమైన వర్తమానం ఉన్నాయి. 1919 ఆగస్టు 15న దినా వాడియా జన్మించారు. 1938లో ఆమె పార్శీ మతానికి చెందిన నెవెల్లీ వాడియాను ప్రేమ వివాహం చేసుకున్నారు. దేశంలో ఎంతో మంది ముస్లిం అబ్బాయిలుండగా తన కూతురు పార్శీని వివాహమాడడంపై జిన్నా అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రత్యేక ముస్లిం దేశం పాకిస్థాన్ కోసం తన నాయకత్వంలో ముస్లింలు ఉధృతంగా పోరాటం చేస్తోంటే… తన ఏకైక కుమార్తె… ఇతర మతస్థున్ని వివాహం చేసుకోవడం జిన్నాకు సుతరామూ ఇష్టం లేదు. కానీ జిన్నా అభ్యంతరాలను దినా తోసిపుచ్చారు.
నువ్వెందుకు ముస్లిం అమ్మాయిని పెళ్లిచేసుకోకుండా..పార్శీ మతస్థురాలిని చేసుకున్నావని జిన్నాను దినా ప్రశ్నించారు. జిన్నా భార్య, దినా తల్లి రత్తన్ బాయి కూడా పార్శీ తెగకు చెందినవారే. తండ్రి సంప్రదాయాన్నే కుమార్తె కొనసాగించారు. పాకిస్థాన్ ఏర్పాటు తర్వాత జిన్నా ఆ దేశంలో స్థిరపడగా… దినా వాడియా మాత్రం భర్తతో కలిసి భారత్ లోనే ఉన్నారు. తర్వాత వారు న్యూయార్క్ కు వలస వెళ్లి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఆమె కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త నస్లీవాడియా ముంబై కేంద్రంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దినావాడియాకు నస్లీవాడియాతో పాటు కుమార్తె డయానా ఎన్ వాడియా ఉన్నారు. దినావాడియా అంత్యక్రియలు న్యూయార్క్ లో నిర్వహిస్తారని వాడియా గ్రూప్ ప్రతినిధి వెల్లడించారు.