చాలా మంది.. డబ్బుకు ఇచ్చిన విలువ కుటుంబానికి, రక్త సంబంధానికి ఇవ్వడం లేదు. ఆస్తి కోసం సొంతవారినే చంపుతున్నారు. చివరకు కన్న తల్లిదండ్రులను కూడా కడతేర్చుతున్నారు. ఆదిలాబాద్‌లో తాజాగా ఇలాంటి దారుణమే జరిగింది. ఆస్తి కోసం సొంత పెదనాన్ననే చంపేశాడో యువకుడు. కత్తితో అతికిరాతకంగా నరికి హత్య చేశాడు. ఉట్నూర్ మండలం లక్కారం గ్రామపంచాయతీ పరిధిలోని గంగన్నపేటలో ఈ ఘోరం జరిగింది.
గ్రామానికి చెందిన తాళ్లపల్లి శివరాజ్ ఏఎస్ఐగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఐతే కొంతకాలంగా అతడి తమ్ముడు జయరాజ్ ఫ్యామిలీతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం జయరాజ్ కుమారుడు.. తన పెదనాన్న శివరాజ్‌ను దారుణంగా చంపేశాడు. చర్చికి వెళ్తుండగా దాడిచేసి హత్యచేశాడు. అనంతరం పెదనాన్న మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు నిందితుడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడి భార్య రోజా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.