కూతురిని చూసేందుకు రాని కన్నతండ్రి

కూతురిని చూసేందుకు రాని కన్నతండ్రి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తల్లిని చంపిన కేసులో నిందితురాలైన కీర్తిరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్‌ జైలులో ఉంది. అయితే ఈ కేసులో ఆమెను విచారించేందుకు పోలీసులు చేసిన రిక్వెస్ట్‌కు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఆమెను ఐదురోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు కీర్తిని మంగళవారం ఉదయం భద్రత నడుమ హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐదు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం విచారణకు తీసుకెళ్లి సాయంత్రం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు. అయితే జైల్లో ఆమెను కలిసేందుకు తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటివరకు రాకపోగా.. ఆమె మేనత్త, మేనమామలు ఒకసారి ములాఖత్‌లో కలిశారు.

హయత్‌నగర్‌ పీఎస్ పరిధిలోని మునగనూరులో నివాసముండే కీర్తి డిగ్రీ చదువుతోంది. తొలినాళ్ల నుంచి విచ్చలవిడితనానికి అలవాటు పడిన ఆమె తొలుత బాల్‌రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడటంతో పెద్దలు వారిద్దరికి వివాహం నిశ్చయించి నిశ్చితార్థం చేశారు. దీంతో కీర్తి అతడితో శారీరకంగా కలిసి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిస్తే పరువు పోతుందన్న ఆందోళనతో ఇంటి పక్కనే ఉండే శశికుమార్ అనే యువకుడి సాయంతో అబార్షన్ చేయించుకుంది. దాన్ని అడ్డం పెట్టుకుని శశి కీర్తిని బెదిరించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ విషయం కీర్తి తల్లి రజితకు తెలియడంతో కూతురిని హెచ్చరించింది. దీంతో ఆమెను చంపేస్తే ఇద్దరం హాయిగా గడపొచ్చని శశికుమార్ కీర్తికి నూరిపోశాడు.

దీంతో కీర్తి ప్రియుడి సాయంతో తల్లిని దారుణంగా చంపేసి.. శవాన్ని మూడురోజులు ఇంట్లోనే పెట్టుకుని ప్రియుడితో రాసలీలలు కొనసాగించింది. తర్వాత శవం దుర్వాసన రావడంతో యాదాద్రి జిల్లాలోని రామన్నపాడు వద్ద రైల్వేట్రాక్‌పై పడేశారు. రజిత కనిపించకపోవడం, తల్లి ఎక్కడని బంధువులు అడిగితే కీర్తి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి వారు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  శశికుమార్‌తో ఇంత వ్యవహారం నడిపిన కీర్తి.. తాను మొదటి ప్రియుడు బాల్‌రెడ్డినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పోలీసులే షాకయ్యారు.  పోలీసు కస్టడీలో కీర్తి మరెన్ని సంచలన విషయాలు చెబుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.