Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజాస్వామ్యం వచ్చినా నేటికీ కొన్ని రాజవంశాలు తమ ప్రాముఖ్యతను కాపాడుకుంటూనే వున్నాయి. ఇటు ప్రజలు, ప్రభుత్వాలు కూడా అధికారికంగా కాకపోయినా ఆ రాజవంశ గౌరవం నిలబడేలా వారికి గుర్తింపు ఇస్తున్నాయి. దేశమంతా ఘనంగా చెప్పుకునే మైసూర్ దసరా ఉత్సవాలు, మైసూర్ ప్యాలస్ వెనుక 400 ఏళ్ల నాటి కథ దాగి వుంది. ఓ రాజవంశానికి తగిలిన శాపం వుంది. ఆ శాపం ఇన్ని వందల ఏళ్ల తర్వాత విమోచనం కాబోతోంది. ఇంతకీ ఆ శాపం ఏమిటంటే… మైసూర్ ప్యాలస్ హక్కుదారు ఒడయార్ రాజవంశంలో 400 ఏళ్లుగా సంతానం లేదు. రాజుగా సింహాసనం అధిష్టించేవాళ్ళు తమ బంధువుల్లో ఎవరో ఒకరిని దత్తత తీసుకోవడం వారిని తమ వారసుడిగా ప్రకటించడమే ఈ 400 ఏళ్లుగా సాగింది. అలా ఏ రక్త సంబంధం లేకుండా దత్తత వచ్చిన వారికి సైతం ఇన్నేళ్ళలో సంతానం కలగలేదు. అసలు ఒడయార్ రాజవంశానికి శాపం ఎందుకు తగిలిందో తెలుసుకోవాలంటే 400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి.
ఇప్పుడు మైసూర్ గా పేరుపడ్డ రాజ్యం 400 ఏళ్ల కిందట శ్రీరంగ పట్నం గా ప్రసిద్ధి. శ్రీ రంగాయన ఉరఫ్ తిరుమల రాజు ఆ రాజ్యానికి రాజుగా ఉండేవారు. ఆయన సతీమణి, మహారాణి అలివేలమ్మ. అప్పట్లో ఒడయార్ రాజు తిరుగుబాటుతో మైసూర్ రాజ్యాన్ని వశపర్చుకున్నాడు. ఆ నమ్మకద్రోహం తట్టుకోలేని అలివేలమ్మ కొన్ని నగలు తీసుకుని తలకాడు ప్రాంతానికి తరలివెళ్లింది. అయితే శత్రుశేషం ఉండకూడదని భావించిన ఒడయార్ రాజు ఆమె మీదకి సైనికుల్ని పంపారు. ఇక ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో ఆమె ఒడయార్ వంశాన్ని వారసులు లేకుండా పోతుందని శపించి కావేరి నదిలో దూకి ఆత్మత్యాగం చేసుకుందట.
అలివేలమ్మ శాపం తర్వాత ఒడయార్ రాజవంశంలో సంతానం అన్న మాట లేదు. ఎవరిని దత్తు తీసుకుని సింహాసనం అప్పగించినా వారికి కూడా సంతానం లేదు. ఈ పరిస్థితుల్లో ఒడయార్ రాజవంశీకులు కొందరు పండితుల్ని సంప్రదించగా వాళ్ళు పాప ప్రక్షాళనకు కొన్ని పూజలు తరతరాలుగా కొనసాగించాలని సూచించారు. అలా చేస్తే 400 ఏళ్ల తర్వాత శాపవిమోచనం జరుగుతుందని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే 405 ఏళ్ల తర్వాత మైసూర్ యువరాజుగా పట్టాభిషిక్తుడైన యదువీరకృష్ణ దత్త చామరాజ్ ఒడయార్ కి కిందటేడు జైపూర్ యువరాణి త్రిషికాసింగ్ తో పెళ్లి జరిగింది. ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. త్రిషికా సింగ్ ప్రస్తుతం 5 నెలల గర్భిణిగా వున్నారు. ఈ వార్త తెలిసినప్పటినుంచి ఒడయార్ రాజవంశం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. 400 సంవత్సరాల తర్వాత మైసూర్ ప్యాలస్ లో పసిబిడ్డ బోసినవ్వులు విరబూయబోతున్నాయి. ఈసారి దసరా ఉత్సవాలు ఇంకాస్ట జోరుగా జరిగే అవకాశం వుంది.