రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9 మరణాల వెనుకున్న మిస్టరీ వీడింది. వరంగల్ నగర శివారు గొర్రెకుంటలోని ఓ పాడుపడిన వ్యవసాయ బావిలో ఈ నెల 21, 22 తేదీల్లో 9 మృతదేహాలు బయటపడటం వెనుక జరిగింది సామూహిక హత్యలేనని తేలింది. మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానిస్తున్న సంజయ్‌కుమార్ యాదవ్ తన బిహార్ స్నేహితులతో కలసి వారిని హత్య చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదే విషయాన్ని ప్రధాన నిందితుడు ఈ కేసు కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచా రణలో అంగీకరించినట్లు సమాచారం.
ఈ నెల 20న రాత్రి ముందుగా కూల్‌డ్రింక్స్‌లో నిద్ర మాత్రలు ఇచ్చి వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నాక స్నేహితుల సాయంతో గోనెసంచుల్లో పెట్టి పాడుపడిన వ్యవసాయబావిలో పడేసినట్లు నింది తులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సంజయ్‌కుమార్‌కు ఎవరెవరు సహకరించారనేది ఇంకా తెలియాల్సి ఉండగా సంజయ్‌తోపాటు మిడిదొడ్డి యాకూబ్, మంకుషా, మక్సూద్ మరదలు, ఓ ఆటో డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మక్సూద్ కుమారుడు సోహిల్ ఆలం పుట్టినరోజు 10 రోజుల క్రితం జరగ్గా అదేరోజు 9 మంది హత్యకు నిందితులు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.