పురుషుల టెన్నిస్‌లో ఇప్పటికే పలు రికార్డులు సాధించిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల ప్రపంచ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక వరుస వారాలు టాప్–10లో నిలిచిన ప్లేయర్‌గా నాదల్ కొత్త రికార్డును నెలకొల్పాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నాదల్ తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దాంతో ఈ స్పెయిన్ స్టార్ వరుసగా 790 వారాలపాటు టాప్–10 ర్యాంకింగ్స్‌లో నిలిచిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. 2005లో ఏప్రిల్ 25న 18 ఏళ్ల ప్రాయంలో తొలిసారి టాప్–10లోకి వచ్చిన నాదల్ 2020 నవంబర్ 11 వరకు టాప్–10లోనే కొనసాగుతున్నాడు.
789 వారాలతోపాటు ఇప్పటివరకు అమెరికా దిగ్గజ ప్లేయర్ జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న ఈ రికార్డును 34 ఏళ్ల నాదల్ బద్దలు కొట్టాడు. కానర్స్ 1973లో ఆగస్టు 23 నుంచి 1988 సెప్టెంబర్ 25 వరకు టాప్–10లో ఉన్నాడు. ఐదు వారాల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను 13వసారి సొంతం చేసుకొని అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును నాదల్ సమం చేశాడు. టాప్–10లో అత్యధిక వరుస వారాలు నిలిచిన క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ మూడో స్థానంలో (734 వారాలు; 2002 అక్టోబర్ 14 నుంచి 2016 అక్టోబర్ 31 వరకు)… ఇవాన్ లెండిల్ (చెక్ రిపబ్లిక్/అమెరికా– 619 వారాలు; 1980 జూలై 7 నుంచి 1992 మే 10 వరకు) నాలుగో స్థానంలో… పీట్ సంప్రాస్ (అమెరికా–565 వారాలు; 1990 సెప్టెంబర్ 10 నుంచి 2001 జూలై 1 వరకు) ఐదో స్థానంలో ఉన్నారు.