అమెరికాలో ఇంకా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో… ఈనెల 31 నుంచి న్యూయార్క్‌లో ప్రారంభం కావాల్సిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనడంలేదని పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ వెల్లడించాడు. ‘ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. కోవిడ్–19 కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారిపై మనకింకా నియంత్రణ రాలేదనిపిస్తోంది. ఆడకూడదనే నిర్ణయం నేను తీసుకోవద్దనుకున్నాను.
కానీ నా మనసు మాట విన్నాకే ఈసారి న్యూయార్క్ వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నాను’ అని కెరీర్లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన 34 ఏళ్ల నాదల్ వ్యాఖ్యానించాడు. ఫెడరర్, నాదల్ గైర్హాజరీలో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు యూఎస్ ఓపెన్ రూపంలో కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచేందుకు సువర్ణావకాశం లభించనుంది. నిర్వాహకులు వెల్లడించిన తాజా జాబితా ప్రకారం ప్రపంచ ర్యాంకింగ్స్‌లోని టాప్–10 ఆటగాళ్లలో ఏడుగురు తమ ఎంట్రీలను ఖరారు చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ మినహా టాప్–10లోని తొమ్మిది మంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు.