Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ లో పేరుకు pcc అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అయినప్పటికీ పెత్తనం అంతా కేవీపీ రామచంద్రరావు చేతుల్లో ఉంటుందనేది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ శ్రేణుల్లో కేవీపీ హవా గురించి తెలియని వారు ఎవరుంటారు ? వై.ఎస్ సీఎం అయ్యింది మొదలుకుని ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో కేవీపీ చెప్పిందే వేదం లా జరుగుతూ వస్తోంది. వై.ఎస్ చనిపోయాక కూడా కేవీపీ కాంగ్రెస్ ని అంటిపెట్టుకుని ఉండడంతో అధిష్ఠానం కూడా ఆయన మాటకు విలువ ఇస్తూ వస్తోంది. అయితే కేవీపీ అలా కాంగ్రెస్ లో కొనసాగడానికి పార్టీ మీద ప్రేమ కన్నా వైసీపీ అధినేత జగన్ కి మేలు చేయడానికి, కాంగ్రెస్ కి పూర్వ వైభవం రాకుండా చూసేందుకు అని 10 జన్ పథ్ లో చిన్న డౌట్ మొదలైంది. ఆ సందేహం నిజమా, కాదా అని కొంత సమాచారం కూడా సేకరించిందట. ఆ క్రమంలో ఏపీ కాంగ్రెస్ లో కేవీపీ కి నమ్మిన బంటుల్లా వుండే ఉండవల్లి లాంటి వాళ్ళు జగన్ కోసమే పనిచేస్తున్నారని తెలుసుకోవడంతో పాటు మల్లాది విష్ణు లాంటి ఇంకొందరు పార్టీ మారడానికి కారణం ఆయనే అని తెలుసుకున్నారట.
రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక కొత్తగా ఏర్పడిన టీం సైతం ఆంధ్రాలో పార్టీకి పూర్వ వైభవం రావాలంటే కొత్త నాయకుడిని బరిలోకి తేవాలని డిసైడ్ అయ్యిందట. ఆ వ్యూహంలో భాగంగా తెనాలి మాజీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ మీద కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పడిందట. ఇప్పటికే మనోహర్ ని పిలిచి ఇందుకు సంబంధించిన ప్రాధమిక చర్చలు జరిపిందట. కాంగ్రెస్ ని నడిపించే పూర్తి స్వేచ్ఛ, సహకారం అందిస్తామని కూడా మనోహర్ కి భరోసా ఇచ్చిందట. ఆంధ్రాలో పార్టీకి గౌరవప్రదమైన స్థానం తెస్తే జాతీయ స్థాయిలో ఆయనకు ప్రాధాన్యం ఇస్తామని కూడా హామీ ఇచ్చిందట. మనోహర్ కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా పార్టీ మీద తన ఆధిపత్యం తగ్గుతుందని అనుకుంటే కేవీపీ లాంటి రాజకీయ మాంత్రికుడు చూస్తూ ఊరుకుంటారా ? కేవీపీ తన రాజకీయ అనుభవాన్ని పూర్తి స్థాయిలో ప్రయోగిస్తే నాదెండ్ల లాంటి మెతక మనిషి ఆయన్ని ఎంతవరకు నిలవరించగలరో మరి ?