సేఫ్‌ జోన్‌ చూసుకున్న చైతూ

Naga Chaitanya Sailaja Reddy Alludu movie release date

నాగచైతన్య హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శైలజ రెడ్డి అల్లుడు’. భారీ అంచనాల నడుమ పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో శైలజ రెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తున్న కారణంగా సినిమాపై అంచనాలు మరింతగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మారుతి చేసే ప్రతి సినిమాలో కూడా చక్కని వినోదం ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో కూడా వినోదాత్మక సన్నివేశాలు బోలెడు ఉంటాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఇటీవల మారుతి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

‘భలే భలే మగాడివోయ్‌’, ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’ ఇలా అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని కూడా సేఫ్‌ జోన్‌లో, పోటీ లేని సమయంలో విడుదల చేస్తే తప్పకుండా మంచి వసూళ్లు నమోదు అవుతాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని భావించారు. అయితే ఆగస్టు చివర్లో పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడంతో ఆగస్టు 31న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై మూడు వారంలో షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను చేయనున్నారు. ఆగస్టు 31న చిత్రాన్ని విడుదల చేసి సక్సెస్‌ను దక్కించుకోవాలని మారుతి ప్లాన్‌ చేస్తున్నారు.