తెరపై ఎలా ఉన్నా, బయట మాత్రం నాగశౌర్య బాగా మొహమాటస్థుడు. మాట్లాడడానికి, నలుగురిలో కలవడానికి సిగ్గుపడుతుంటాడు. స్టేజీ ఎక్కితే అది కాస్త ఎక్కువే అవుతుంది. కానీ.. నాగశౌర్య మారాడు. తన మాటలతో మనసు దోచుకున్నాడు. ‘అశ్వద్ధామ’ పాటల వేడుక ఈరోజు ఖమ్మంలో జరిగింది. స్టేజీపై నాగశౌర్య మాట్లాడిన విధానం చూస్తే.. ముచ్చట వేస్తుంది. తన తప్పుల్ని నిర్భయంగా ఒప్పుకుని, తన ఫ్లాపుల్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. సాధారణంగా హీరోలకు హిపోక్రసీ ఎక్కువ. తమ ఫ్లాపుల్ని కూడా హిట్స్‌గా చెప్పుకుంటారు. అయితే నాగశౌర్య అలా కాదు. ‘నర్తన శాల’ ఫ్లాప్ అయ్యిందని, అలాంటి తప్పు తన జీవితంలో చేయనని వేదిక పై మాటిచ్చాడు.
తన కొత్త సినిమా ‘అశ్వద్ధామ’ కోసం ప్రాణం పెట్టి పని చేశానని, ఈ సినిమా కోసం తనతో పని చేస్తానన్న వాళ్లు చేయిచ్చి వెళ్లిపోయారని, చేయను అన్నవాళ్లు తనతో పాటు కలసి పనిచేశానని, తన జీవితం అంటే ఏమిటో ఈ సినిమా నేర్పిందని ఉద్వేగభరితంగా చెప్పాడు శౌర్య. తన కోసం చిన్నప్పటి నుంచీ అమ్మానాన్నలు ఎంతో ఖర్చు చేశారని, అనవసరమైన విషయాలపై లక్షలు పోశారని, ఈ సినిమా మొదలెట్టిన తరవాత అలా ఎప్పుడూ ఖర్చు పెట్టించకూడదని అనుకున్నానని చెప్పాడు శౌర్య. ఈ సినిమాని చాలా ప్రేమించానని, అందుకే ఛాతీపై పచ్చబొట్టు పొడిపించుకున్నానని వేదికపై చొక్కా విప్పి… టాటూని చూపించాడు. మొత్తానికి ఈ సినిమాపై శౌర్య చాలా నమ్మకంగా ఉన్నాడు.