Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్, అక్కినేని తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళు లాంటి వారని చెప్పుకుంటారు. ఓ సానుకూల దృక్పధంతో చెప్పిన ఆ మాటని ఇప్పుడు ప్రతికూల దృక్పధంతో నిజం చేసేస్తున్నారు. పైన చెప్పినట్టు ఆ ఇద్దరు రెండు కళ్ళు అయితే ఒక కన్ను ఇంకో కన్నుని చూడలేనట్టు తయారైంది బాలయ్య , నాగ్ ల మధ్య వ్యవహారం. ఎన్టీఆర్, అక్కినేని చిత్రసీమలో పోటాపోటీగా సినిమాలు చేస్తున్నప్పుడు రెండు క్యాంపుల గొడవ ఉండేది. అయితే ఆ ఇద్దరి మధ్య పోటీతో సంబంధం లేకుండా అక్కినేని అమ్మ ఎన్టీఆర్ ని పెద్దోడని పిలిచేదట. ఇక ఎన్టీఆర్ సంతానం అయితే అక్కినేని ని బాబాయ్ అంటూ తెగ హడావిడి చేసేవాళ్ళు. ఎన్టీఆర్ సంతానం మాత్రమే కాదు ఆయన అల్లుడు చంద్రబాబు కూడా తాను సీఎం అయిన కొత్తల్లో అక్కినేనితో బాగా దగ్గరగా మెసిలేవాళ్ళు. బాబు జన్మభూమికి స్పందించి సొంత వూరి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు అక్కినేని. ఇదంతా గతం.
అక్కినేని బతికి వున్నప్పుడు ఆయన కుటుంబం ఆయన గౌరవార్ధం ఓ ఫంక్షన్ జరిపింది. ఆ సభకు బాలయ్యకి ఆహ్వానం పంపలేదట ఆ వ్యవహారాలు చూసిన నాగ్. దీంతో బాలయ్య బాగా హర్ట్ అయ్యారట. నాగ్ సారీ చెప్పినా బాలయ్య కోపం తగ్గలేదట. అప్పటినుంచి ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదిక మీదకి వచ్చింది లేదు. అక్కినేని చనిపోయినప్పుడు కూడా బాలయ్య భార్య వచివెళ్ళింది తప్ప ఆయన రాలేదు. పైకి తమ మధ్య ఏమీ గొడవలు లేవని నాగ్ చెబుతున్నా పరిస్థితి అందరికీ అర్ధం అవుతూనే వుంది. తాజాగా అక్కినేని అవార్డుల ఫంక్షన్ తో ఆ తేడా ఇంకోసారి స్పష్టంగా తెలిసింది.
ఈ సభకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని పిలిచిన నాగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని మాత్రం పిలవలేదు. ఫంక్షన్ జరుగుతోంది తెలంగాణాలో అయినా అక్కినేని తెలుగు ప్రజలు అందరివాడు. ఈ విషయం ప్రత్యేకంగా నాగ్ కి చెప్పక్కర్లేదు. రాజకీయంగా జగన్ తో స్నేహం ఉండొచ్చు గానీ ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలా వ్యవహరించడం నాగ్ స్థాయికి తగినట్టు లేదనే విమర్శలు వస్తున్నాయి. నాగ్ ఎందుకిలా చేస్తున్నాడో మరి ?