Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని వారాల క్రితం తమిళ హీరో ధనుష్ దర్శకత్వంలో తెలుగు యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. ధనుష్ దర్శకత్వంలో రాజశేఖర్ నటించబోతున్నట్లుగా జీవిత కూడా ఒకానొక సమయంలో చెప్పుకొచ్చారు. గరుడవేగ చిత్రం తర్వాత రాజశేఖర్ చేయబోతున్న సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తాడని అంతా ఎదురు చూస్తున్నారు. తమిళంలో స్టార్ హీరో అయిన ధనుష్‌కు ఎందుకు దర్శకత్వం చేయాలనిపించింది అంటూ ఆలోచనలో పడ్డారు. అది కాకుండా రాజశేఖర్‌తోనే ధనుష్ ఎందుకు సినిమా ప్లాన్ చేశాడా అని అంతా కూడా ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి సమయంలోనే రాజశేఖర్ స్థానంలో నాగార్జునను ధనుష్ ఎంపిక చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది.
నాగార్జున తాజాగా ‘ఆఫీసర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం తాను నానితో కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నాను. ఆ చిత్రం తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రం చేయాలనుకున్నాను. కాని ఇంకా కథ ఫిక్స్ కాలేదు, ధనుష్ కూడా ఒక చిత్రంలో నటించాల్సిందిగా కోరాడు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. దాంతో రాజశేఖర్‌ను తప్పించి ఆ సినిమాలో నాగార్జునను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. నానితో నాగార్జున చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వంలో సినిమా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.