తెలంగాణ సీనియర్ నేత, రాష్ట్ర మాజీహోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. గత కొంతకాలగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.అయితే నాయిని ఆరోగ్యం ఇప్పుడు మరింత ఆందోళనకరంగా మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన శరీరం ఇప్పుడు వైద్యానికి కూడా సహకరించడం లేదని సమాచారం. నాయిని ఆరోగ్యం గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
గతనెలలో నాయినికి కరోనా సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకున్నారు. కరోనా నెగిటివ్‌గా రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి లేకపోవడంలో మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. ఉపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు పరీక్షలు చేశారు. ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందని వైద్యులు గుర్తించారు. దీనితో అయన ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై గత కొన్నిరోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు.
టీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆస్పత్రిలో నాయినిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాల్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు.. పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయను పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని.. వైద్యానికి కూడా సహకరించడంలేదని తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్లో తీవ్ర ఆందోళన నెలకొంది.