నల్లమలలో యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో వారం రోజుల కిందట మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులపై నిఘా పెట్టాలని, అన్ని పోలీసుస్టేషన్ల ఎస్ఐలకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
నల్లమల అడవుల్లో యురేనియం ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు సర్వేకు అనుమతి ఇచ్చింది. నల్లమల అడవిలోని కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్‌లో 38 చదరపు కిలో మీటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అనుమతులు రావడంతో అచ్చంపేట, అమ్రాబాద్ అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. డ్రిల్లింగ్యంత్రాలు తీసుకు వచ్చేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. యురేనియం సర్వే గురించి తెలియగానే మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు రంగంలోకి దిగారు.
ప్రధానంగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే నల్లమలలోనే ఉంటూ తన కార్యకలాపాలు కొనసాగించే వారు. పలు సార్లు పోలీసుల ఎన్కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లలో అప్పటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు, కేంద్ర కమిటీ సభ్యులు శాఖమూరి అప్పారావు, తదితరులు మృతి చెందారు. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోవడం, మరికొందరు లొంగిపోవటంతో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది.
గత నెల నుంచి యూరేనియం నిక్షేపాల కోసం సర్వేలు జరుగుతున్నాయని, దాన్ని వ్యతిరేకించాలంటూ గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ ఉద్యమం ద్వార మళ్లీ మావోయిస్టులు ప్రవేశిస్తారా, ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ మద్దతు ఇస్తున్నారా అనే అంశాలను ఆరా తీస్తున్నారు. పనిలో పనిగా లొంగిపోయిన మాజీ మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే అంశాలపై సంబంధిత స్టేషన్ల ఎస్ఐలు సమాచారాన్ని సేకరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.