నాని మరియు కీర్తి కలిసి బుల్లితెరపై హంగామా…!

నేచురల్ స్టార్ నాని మరియు కీర్తి సురేష్ కలిసి నటించిన నేను లోకల్ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమాలో వారిద్దరి ముచ్చటైన జంట ని చూసి, అబ్బా కెమిస్ట్రీ భలే పండిందిరా అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు అనుకున్నారు. నాని ఎవరితో చేసినా కెమిస్ట్రీ పండిస్తాడు కదా అని అనుకున్నా సరే నేను లోకల్ సినిమాలో నాని & కీర్తి సురేష్ ది బెస్ట్ కెమిస్ట్రీ అంటూ రానా కూడా అనుకున్నాడు. అందుకే మరోసారి వీరిద్దరి చేత బుల్లితెర పైన హంగామా చేయించాలని వారిద్దరిని రానా తన టెలివిజన్ షో “నం.1 యారి విత్ రానా” కి అతిధులుగా ఆహ్వానించాడు.

అసలే నాని మొహమాటపడుతూనే భలేగా అల్లరి చేస్తుంటాడు. ఇక కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే క్లాస్ గా కనిపిస్తూనే, మాస్ పంచులు వేస్తుంటుంది. నేను లోకల్ లో వీరి జంట కి ఫాన్స్ అయిన వీరిద్దరి అభిమానులు ఈ ఆదివారం రోజున టీవీ లో ప్రసారం అయ్యే ఈ షో లో వీరు చేసిన అల్లరి కి మరోసారి ఫిదా కావాల్సిందే అని రానా కూడా అంటున్నాడు.ఆదివారం రోజున జెమినీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే ఈ షో, viu ఛానల్ లో కూడా ప్రసారం అవుతుంది. నం.1 యారి విత్ రానా షో సీజన్-1 సక్సెస్ అయ్యి, ఇప్పుడు సీజన్-2 నడుస్తుంది.

రానా అడిగే ఘాటైన ప్రశ్నలు, కొంటెగా కవ్వించే మాటలు, ఆడిపించే ఆటలు అన్ని కలిపి ఆదివారం రోజున తెలుగు టీవీ ప్రేక్షకులకి మాంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నాయి. నాని తన తదుపరి సినిమా జెర్సీ లో నటిస్తుండగా, కీర్తి సురేష్ నటించిన తమిళ చిత్రాలు కూడా తెలుగు లో విడుదలయ్యి తన అభిమానులని అలరించాయి. మహానటి తెలుగు సినిమా తరువాత కీర్తి సురేష్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమాలు సామి, పందెం కోడి-2, సర్కార్ వంటి మూడు సినిమాలు తెలుగు లో విడుదల అయ్యాయి. ఇప్పటికైతే కీర్తి సురేష్ ఏ తెలుగు సినిమాకి సైన్ చేయలేదు.