నేచురల్ స్టార్ నాని హీరోగా, మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి..’ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మూవీ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
అయితే ఈ మూవీ దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతుండగా కన్నడ వెర్షన్లో మాత్రం డబ్ కాలేదు.ఈ నేపథ్యంలో బుధవారం మూవీ టీజర్ లాంచ్ వేడుకలో నాని దీనిపై స్పందించాడు. ఈ సందర్భంగా నాని చేసిన కామెంట్స్‌పై కన్నడ ప్రేక్షకులు హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. దీంతో నాని కన్నడ ఆడియన్స్‌కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే.. అంటే సుందరాకి టీజర్ ఈవెంట్లో ఈ మూవీ కన్నడ డబ్బింగ్ వెర్షన్ అంశంపై నాని మాట్లాడాడు.
‘ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు తెలుగులోనే చూస్తారు. అందుకే కన్నడలో మా మూవీని డబ్ చేయడం లేదు. ఎందుకంటే చాలా మంది కన్నడ ప్రజలు తెలుగు అర్థం చేసుకుంటారు. తెలుగు చిత్రాలను తెలుగులోనే చూసేందుకు వారు ఇష్టపడతారు. కానీ మిగతా వాళ్లకు మాత్రం వాళ్ళ భాషల్లో సినిమాను విడుదల చేస్తేనే అర్థమౌవుతుంది’ అని అన్నాడు.
దీంతో నాని వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘నాని గారు మీరు తప్పు. చాలా మంది కన్నడిగులకు తెలుగు, తమిళ భాషలు అర్థం కావు. కనీసం వారు తెలుగును అర్థం కూడా చేసుకోలేరు. అలాంటి వారు కూడా మీ సినిమాలు చూడాలి అనుకుంటే తప్పకుండ మీ సినిమాను కన్నడలో డబ్ చేయాల్సిందే’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
దీనికి నాని స్పందిస్తూ.. ‘కన్నడ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేని సమయంలో కూడా నా సినిమాలు లేదా ఇతర తెలుగు చిత్రాలను మన కన్నడ కుటుంబం ఆదరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెస్మీట్లో నేను చేసిన ఈ వ్యాఖ్యలు ఒక నిర్దిష్ట సందర్భంలో సమాధానం అవుతుంది. కానీ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి దాని అర్థాన్ని మార్చేశారు’ అంటూ రీట్విట్ చేశాడు. అలాగే మరో ట్వీట్లో ‘తన అభిప్రాయాన్ని సరిగా చెప్ప్పలేకపోయుంటే క్షమించండి… బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్‌కు గర్వపడుతున్నా’ అని నాని వ్యాఖ్యానించాడు.