Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమాజంలో సహజంగా మహిళలను బాధితులుగా, మగవాళ్లను బాధలు పెట్టేవాళ్లగా భావిస్తాం. భర్త, సహోద్యోగి, ఉన్నతాధికారి..వంటివారి చేతిలో మహిళలు బాధలకు గురవుతుంటారు. శారీరక హింస, గృహహింస, లైంగికవేధింపుల వంటి కష్టాలు ఎదుర్కొంటుంటారు. ఇలా పురుషుల చేతిలో బాధలు పడే మహిళలకు చట్టం, న్యాయం అండగా ఉంటాయి. సమాజం నుంచి కూడా సానుభూతి లభిస్తుంది. బాధితురాళ్లకు సాయపడేందుకు పలువురు ముందుకొస్తారు. మొత్తంగా… మహిళలు సమాజంలో ఎన్నో బాధలు పడుతున్నప్పటికీ… వాళ్లకు చేయూతనిచ్చే పరిస్థితులూ ఉన్నాయి. అదే పురుషుల విషయానికొస్తే వారి పరిస్థితి భిన్నం. సమాజంలో ఎక్కవగా బాధితులు మహిళలు అయినప్పటికీ… కొందరు పురుషులు కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కుటుంబపరంగా చాలా మంది పురుషులకు అనేక బాధలు ఉంటాయి. భర్తలను ఇంట్లో అనేక ఇబ్బందులు పెట్టే భార్యలు చాలా మందే ఉంటారు.
ఇంట్లో భార్య చేసే విమర్శలు, మాట్లాడే సూటిపోటు మాటలు తట్టుకోలేక మగవాళ్లు కొందరు వ్యసనాలకు బానిసలవుతుంటారు కూడా. కానీ సాధారణంగా మగవాళ్లు ఈ విషయాలు బయటివారితో చర్చించరు. ఎన్ని బాధలున్నా మనసులోనే సహిస్తారు కానీ..కోర్టులు, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించాలనుకోరు. చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగా ఉండడం కూడా ఇందుకు ఓ కారణం. అలాగే మహిళల చేతిలో బాధలకు గురయ్యామని చెప్పుకోవడాన్ని వారు చిన్నతనంగా కూడా భావిస్తారు. ఈ పరిస్థితులనే కొందరు మహిళలు తమకు అనుకూలంగా మలుచుకుని భర్తలను, కొడుకులను, సోదరులను అనేక విధాలుగా బాధపెడతారు. మరికొందరు ఇంకా తెంపరితనం ప్రదర్శించి హత్యల దాకా వెళ్తారు. కొన్ని నెలల క్రితం వెలుగుచూసిన నాగర్ కర్నూల్ స్వాతి ఉదంతంతో పాటు శ్రీకాకుళం సరస్వతి, నీలిమలు ఇందుకు ఉదాహరణ. ప్రేమ వ్యవహారాలో, మరే ఇతర కారణం చేతనో భర్తలను చంపుతున్న భార్యల కథలు వెలుగుచూస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి.
గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన స్వాతి, ప్రియుడు రాజేశ్ తో కలిసి భర్త సురేందర్ రెడ్డిని చంపడం, ఆ తర్వాత రాజేశ్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించి సురేందర్ రెడ్డి స్థానంలో తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నం తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. స్వాతి ప్లాస్టిక్ సర్జరీ ఆలోచన పోలీస్ ఉన్నతాధికారులనే విస్మయపరిచింది. స్వాతి రెడ్డి వ్యవహారం తర్వాత భార్యబాధితులపై తెలుగు ప్రజల్లో బాగానే చర్చ జరిగినప్పటికీ తర్వాత సద్దుమణిగింది. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం శ్రీకాకుళంలో వెలుగుచూసిన సరస్వతి కేసు… భార్యలంటేనే భయపడే పరిస్థితి కల్పించింది.
ప్రియుడి కోసం కిరాయి ముఠాకు డబ్బులిచ్చిమరీ పెళ్లయిన కొత్తలోనే భర్తను చంపించిన సరస్వతి వైనం అందరినీ నివ్వెరపరిచింది. అది మర్చిపోకముందే ఆదివారం నీలిమ అనే నవవధువు బైక్ పై వెనకనుంచి భర్తను చాకుతో పొడవడం షాక్ కు గురిచేసింది. ఇలాంటి కేసుల్లో ఆయా క్రూరమహిళల ప్రవర్తన గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ… బాధితులైన మగవారికి సమాజం నుంచి సరైన సహకారం అందదు. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళల నుంచి పురుషులను రక్షించాల్సిన అవసరం ఉందని, దీనికోసం పురుష కమిషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ఘటనలు తనను షాక్ కు గురిచేశాయన్నారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామని తెలిపారు. మహిళలపై టీవీ సీరియల్స్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని, వారిలో నేరప్రవృత్తి పెరిగేందుకు సీరియల్స్ దోహదం చేస్తున్నాయని ఆరోపించారు. మహిళల్లో నేరపూరితమైన ఆలోచనలు రావడం సమాజానికి మంచిది కాదన్నారు. సీరియల్స్ మీద సెన్సార్ పెట్టాలని డిమాండ్ చేశారు.