ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేసే నియోజకవర్గంపై సస్పెన్స్ వీడింది. ఆయన రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి పోటీ చేయడం ఖాయమైంది. దీనిపై టీడీపీ అధిష్ఠానం స్పష్టమైన ప్రకటన చేసింది. నారా లోకేష్ పోటీపై కొద్దిరోజులు పార్టీలో ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి లోకేశ్ పోటీ చేస్తారంటూ నిన్నటి దాకా ప్రచారం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం, కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి కూడా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. లోకేశ్ భీమిలి నుంచి పోటీ చేస్తే తాను ఆ స్థానం వదులుకుంటానని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో అక్కడి నుంచే ఆయన పోటీ చేస్తారని అందరూ భావించారు. లోకేష్‌ను రాజధాని ప్రాంతం నుంచి పోటీ చేయించాలంటూ అధికశాతం పార్టీ శ్రేణులు కోరడంతోనే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు లోకేశ్ ఓటుహక్కు కూడా మంగళగిరి పరిధిలోనే ఉండటం కూడా పరిగణనలోకి తీసుకుని ఆయన్ని అక్కడి నుంచే పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించింది.