కేసీఆర్ బాటలోనే మోడీ…!

Narendra Modi Comments On Mahakutami

ఎన్నికయినప్పుడు ఎంత హుషారుగా ఉందొ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అంత డీలాపడిపోయి వ్యతిరేకతను ఎదుర్కొంటోంది మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 282 సీట్లు రాగా, మిత్రపక్షాలను కలుపుకొని 336 సీట్లు గెలిచుకుంది. మోడీ మేనియానే దీనికి కారణమని అప్పట్లో అంతా అనుకున్నారు. అయితే, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఎన్డీయేపై వ్యతిరేకత పెరిగిపోయింది. దీనికి తోడు బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలన్నీ ఏకమై ఓ కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలు ఏకతాటిపైకి వచ్చారు. ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీని కలుపుకుని బీజేపీయేతర కూటమి ఏర్పాటు దిశగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు, బీజేపీ అధిష్ఠానం సంచలన నిర్ణయాలు తీసుకోబోతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మోదీని కాకుండా గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టాలని భారతీయ జనతా పార్టీలోకి కొందరు సీనియర్లు భావిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ మళ్ళీ రంగంలోకి దిగారు. తాను చేసిన అభివృద్ధి, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు కొద్దిరోజుల క్రితం కేసీఆర్ ఏ ఫార్ములానైతే ఫాలో అయి విజయం సాధించారో.. ఇప్పుడు మోదీ కూడా అదే ఆచరణలో పెట్టాలని చూస్తున్నట్లు ఈ వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతోంది.అప్పుడు కేసీఆర్.. ‘‘ఒక్క బక్కోడిని ఓడించేందుకు ఇన్ని పార్టీలు కలిశాయి’’ అంటూ సెంటిమెంట్‌తో కొట్టారు. ఇప్పుడు మోదీ కూడా ‘‘అసలు మహాకూటమి అనే మాటకే అర్థం లేదు. ఒక వ్యక్తి లక్ష్యంగా పార్టీలన్నీ ఏకమవుతాయా? ఇలాంటి రాజకీయాన్ని జనం తిప్పికొడతారు. ఇది దేశం వర్సెస్‌ మహాకూటమి. తెలంగాణలో మహాకూటమి గతి ఏమైంది. అసలు మహాకూటమిపై చర్చించాల్సిన అవసరం లేదు. అంటూ ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నాలు ప్రారంభించేశారు. మరి, కేసీఆర్ సక్సెస్ అయినట్లు మోదీ కూడా విజయం సాధిస్తారేమో చూడాలి.