Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశాన్ని కుదిపేస్తున్న కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై స్పందించకుండా మోడీ మౌనంగా ఉండడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రధాని లండన్ లో స్పందించారు. లండన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిపై మాట్లాడారు. అత్యాచారం అనేది అత్యాచారమే అని మన కుమార్తెలను ఈ విధంగా దోచుకుంటే ఎలా సహిస్తామని ఆయన ప్రశ్నించారు. అయితే అత్యాచారాలను భిన్న ప్రభుత్వాల కాలాలతో పోల్చిచూడాలని అభిప్రాయపడ్డారు. మీ హయాంలో ఎక్కువా… మా హయాంలో ఎక్కువా అన్నది తన ఉద్దేశం కాదని, అత్యాచారం అనేది ఇప్పుడు జరిగినా, గతంలో జరిగినా అది బాధాకరమే అని స్పష్టంచేశారు. అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దని కోరారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చాలా కఠిన విధానం అంటూ ఉండదని తెలిపారు. అత్యాచార ఘటనల్లో మరో కోణాన్ని కూడా ప్రధాని వివరించారు.
ఈ పాపానికి ఒడిగట్టే వ్యక్తి మరొకరి కుమారుడున్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కుమార్తె ఇంటికి ఆలస్యంగా వస్తే ఎందుకు ఆలస్యమయింది? ఎక్కడికి వెళ్లావు? ఎవరిని కలిశావు? వంటి ప్రశ్నలు వేస్తామని, ప్రతి ఒక్కరూ కూతుళ్లను ఇలాగే అడుగుతారని, కానీ కుమారులను కూడా ఇదే విధంగా ప్రశ్నించాలని మోడీ సూచించారు. ఇప్పుడే కాదు… అత్యాచార కేసుల గురించి మాట్లాడుతూ గతంలో కూడా మోడీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఏం చేస్తున్నారు? ఎక్కడకు వెళ్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు వంటి విషయాల్లో కూతుళ్లను కనిపెట్టుకుని ఉన్నట్టే తల్లిదండ్రులు కొడుకులను కూడా జాగ్రత్తగా గమనిస్తే… అత్యాచారాలు జరగకుండా నిరోధించవచ్చన్నది మోడీ అభిప్రాయం.