కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. ఇటీవల రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై రాహుల్ గాంధీ అనైతికమైన వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ నోటీసులు జారీ చేసినట్లు కమిషన్ పేర్కొంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో భాగంగా లోక్‌సభలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై సీతారామన్ ప్రసంగించారు. రక్షణమంత్రి ప్రసంగాన్ని రాహుల్ పలు సందర్భాలలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో బుధవారం చర్చలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీని కాపాడటానికి ఓ మహిళ వచ్చారు అని మహిళా మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘56 అంగుళాల ఛాతీగల ఓ వ్యక్తి ప్రజాకోర్టు నుంచి పారిపోయి నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్లారు. సీతారామన్ గారు, నన్ను కాపాడండి, నన్ను నేను కాపాడుకోలేను అని సాయం కోరారు. అయితే రెండున్నర గంటల పాటు సాయం కోరిన వ్యక్తిని ఆమె రక్షించలేకపోయారు. మీరు నిజంగా ఆ వ్యక్తిని కాపాడగలిగారా అని అడిగితే ఆమె ఎస్ ఆర్ నో అని ఏ బదులు ఇవ్వలేదు. ఆమె ఆయనను రక్షించలేకపోయారు’ అని రాహుల్ అన్నారు. మహిళా మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ తప్పుపట్టారు. రాహుల్ మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని, పార్టీ అధ్యక్షుడు ఇలా మాట్లాడటం తగదని సూచించారు. మహిళా మంత్రి పై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ నుంచి వివరణ కోరామని, మహిళలను తక్కువ చేసి మాట్లాడటంతో ఆయన ఉద్దేశమేంటో చెప్పాలని నోటీసులలో కోరినట్లు రేఖా శర్మ ప్రకటించారు.