దేశప్రజలకు గుడ్ న్యూస్. ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడవును UIDAI మరోసారి పొడిగించింది. వాస్తవానికి మార్చి 14తోనే ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు ముగిస్తున్నా.. చాలా మంది ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోకపోవడంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరో 3 నెలల వరకు పొడిగించింది. అందువల్ల జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని పేర్కొంది.
ఆధార్ తీసుకుని 10 ఏళ్లు పూర్తైన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉచిత సేవలు ‘మై ఆధార్’ పోర్టల్’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని UIDAI స్పష్టం చేసింది.
ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకోండిలా!
మీరు https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఆధార్ సంఖ్యతో లాగిన్ కావాలి.
‘ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ‘డాక్యుమెంట్ అప్‌డేట్’పై క్లిక్ చేయాలి.
అప్పటికే ఉన్న వివరాల్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే, వాటిని మార్చుకోవాలి. ఉన్న వివరాలనే ఒకసారి వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి ‘ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్’ డాక్యుమెంట్లను ఎంచుకుని సంబంధిత స్కాన్డ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
చివరిగా 14 అంకెల ‘అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్’ వస్తుంది.
దీని ద్వారా అప్‌డేటెడ్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు https://myaadhaar.uidai.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.